Fri Nov 22 2024 15:58:43 GMT+0000 (Coordinated Universal Time)
YCP : వెళ్లేవారిని ఆపేది లేదు.. ఉండే వారిని కాదనేది లేదు.. బతిమాలడం లేదమ్మా... ఇది వైఎస్ జగన్ పాలసీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫుల్లు క్లారిటీతో ఉన్నట్లున్నారు. పార్టీని వీడి వెళ్లే వారిని ఎవరినీ ఆపే ప్రయత్నం చేయడం లేదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫుల్లు క్లారిటీతో ఉన్నట్లున్నారు. పార్టీని వీడి వెళ్లే వారిని ఎవరినీ ఆపే ప్రయత్నం చేయడం లేదు. కనీసం పార్టీ నేతలను పంపించి అయినా బుజ్జగించడం వంటి చర్యలకు దిగడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి ఇప్పుడు ఓటమి పాలయిన తర్వాత పార్టీని వీడివెళ్లడంపై వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకుంటున్నారు. బెల్లం చుట్టూ ఈగలు చేరడం మామూలే. అలాగే వైసీపీ నేతలు కూడా అధికారంలో ఉన్నప్పుడు లీడర్లుగా బిల్డప్ లు ఇచ్చి ఇప్పుడు అధికారం కోల్పోగానే జెండాను వదిలి పెట్టి వెళ్లడం చూస్తే వారిలో ఎంతటి స్వార్థ పూరిత రాజకీయాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలని జగన్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.
పార్టీని వదిలి...
అందుకే తాను నమ్మిన వారు.. తాను పదవులు ఇచ్చిన వారు వదలి వెళ్లి పోతున్నా కొందరు నేతలు వారితో మాట్లాడతామని చెప్పినా అవసరం లేదని వైఎస్ జగన్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలిసింది. వెళ్లే వాళ్లను ఆపకండి అంటూ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అందుకే ఎవరు వెళ్లినా పెద్దగా పట్టించుకోవద్దని, వైసీపీకి నాయకత్వ సమస్య ఎక్కడా లేదని వైఎస్ జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలిసింది. పార్టీ నుంచి వెళుతున్న వారు అనవసర సాకులు చెబుతున్నారని, పార్టీపై అభిమానం ఉంటే నేరుగా తనకు కంప్లయింట్ చేయాలని, అంతే తప్ప కుంటిసాకులు చెప్పడం ఏంటని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
బతిమాలాడాల్సిన...
ఆళ్ల నాని విషయంలో కొందరు ఈ విషయాన్ని వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా ఏం అన్యాయం చేశామని నాని పార్టీని వీడి వెళ్లిపోయారో ఆయనే చెప్పాలన్నారు. నానిని బతిమాలాడాల్సిన అవసరం లేదని, ఎవరూ ఆ ప్రయత్నం కూడా చేయవద్దని సూటిగా చెప్పడంతో పశ్చిమ గోదావరి నేతలు ఆ ప్రయత్నాలు మానుకున్నట్లు తెలిసింది. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికి అయినా కట్టుబడి ఉండాలి తప్ప ఇక్కడ ఎవరి సొంత నిర్ణయాలు అమలు కావని వైఎస్ జగన్ కటువుగానే సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు. ఆళ్ల నానికి పార్టీ పరంగా ఎంతో చేసినా వ్యక్తిగత కారణాలంటూ పార్టీని వదిలిపెట్టడం మంచి పద్ధతి కాదని వైఎస్ జగన్ అన్నట్లు తెలిసింది.
సొంత కుటుంబ సభ్యులే...
వీరితో పాటు కిలారి రోశయ్య, మద్దాలి గిరి వంటి వారికి కూడా జగన్ ఇదే రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఎవరు వెళ్లినా పెద్దగా పట్టించుకోవాల్సిన అసవరం లేదని జగన్ చాలా స్పష్టమై వైఖరితో ఉన్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. అందుకే పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ జగన్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే మంచిదని సీనియర్ నేతలకు చెబుతున్నారని తెలిసింది. సొంత కుటుంబ సభ్యులే తాను పెద్దగా పట్టించుకోలేదని, పార్టీ ఆదరించిన వాళ్లు వెళితే ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీతో నేతలకు చెప్పారు. 2029 ఎన్నికల్లో విజయం వైసీపీదేనని, నమ్మిన వాళ్లు ఉంటే ఉంటారని, లేని వాళ్లు పార్టీని వీడి వెళితే ఎందుకు కంగారు పడతారని కూడా అన్నట్లు చెబుతున్నారు.
Next Story