Fri Apr 18 2025 19:38:49 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : అమ్మో.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే మా పనేంటి?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారి అధికారం తనదేనన్న ధీమాతో ఉన్నారు. కానీ జగన్ రాకూడదని చాలా మంది భావిస్తున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారి అధికారం తనదేనన్న ధీమాతో ఉన్నారు. కానీ జగన్ రాకూడదని చాలా మంది భావిస్తున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి రివర్స్ అవుతుందని భావిస్తున్నారు.. జగన్ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదని అనుకుంటున్న వర్గాలు ఎక్కువేగానే కనిపిస్తున్నాయి. కాబట్టి జగన్ కు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదు. కూటమి పార్టీలను ఎదుర్కొనడం అంత ఈజీ కాదు. అదే సమయంలో కొన్ని కీలక వర్గాల నుంచి మద్దతు లభించడం కూడా సాధ్యపడే అవకాశాలు లేవు. 2019 కు ముందు జగన్ పాలనను ఎవరూ చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ వ్యవహరించిన తీరుతో కొన్ని వర్గాలను ఆయనే దూరం చేసుకున్నట్లయింది.
మధ్యతరగతి ప్రజలు...
ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు జగన్ రాకూడదని కోరుకుంటున్నారు. అప్పులు చేసి పేదలకు పంచి పెట్టడం మినహాయించి జగన్ పాలనలో అభివృద్ధి లేదని మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది నేటికీ భావిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ చేసిన పాలనలో తమకు మంచి జరగకపోగా నష్టమే జరిగిందన్న భావనలో మధ్యతరగతి ప్రజలున్నారు. విపరీతంగా పన్నులు భారం మోపడంతో పాటు అభివృద్ధి పనులు చేయకపోవడం, సరైన రహదారులు నిర్మించకపోవడం పట్ల ఎక్కువ మంది పెదవి విరుస్తున్నారు. అందుకే బ్రాహ్మణ, వైశ్య వంటి సామాజికవర్గాలతో పాటు మిగిలిన సామాజికవర్గాల్లోని మధ్యతరగతి ప్రజలు జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి కాకూడదని కోరుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ నుంచి మద్యం దుకాణాల వరకూ...
ఇక పారిశ్రామికవేత్తల అయితే తొలి నుంచి జగన్ పాలన అంటే వ్యతిరేకతతో ఉన్నారు. కనీసం పరిశ్రమల స్థాపన జరగకపోవడంతో పాటు తమకు అవకాశాలు ఇవ్వలేదన్న అభిప్రాయంతో ఉన్నారు. దీంతో పాటు అమరావతి ప్రాంత రైతులు ఎటూ వ్యతిరేకమే. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా జగన్ కు వ్యతిరేకమే. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకూ ఏపీలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడకేసింది. రాష్ట్రంలో ఎక్కడా భూముల క్రయవిక్రయాలు జరగకపోవడంతో రియల్ వ్యాపారులు సయితం జగన్ పాలనపై అక్కసుతో ఉన్నారు. ఇక మందుబాబులు సరే సరి. మద్య నిషేధం పేరు చెప్పి ప్రభుత్వ దుకాణాల ద్వారా నాసిరకం మద్యం విక్రయించారన్న ఆరోపణలు ఆయన వారి నుంచి ఎదుర్కొంటున్నారు.
పేద వర్గాలు మాత్రం...
మరొకవైపు మద్యం వ్యాపారులు అయితే జగన్ పాలనను ఇక జన్మలో చూడకూదదని అనుకుంటున్నారు. జగన్ అధికారంలో వస్తే తిరిగి మద్యం దుకాణాలు ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోతాయని వారు భయపడుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్ పాలన పట్ల విసిగిపోయి ఉన్నారు. కనీసం జీతాలు సకాలంలో రాకపోవడం, రిటైర్ అయిన వారికి ప్రయోజనాలు అందకపోవడాన్ని గుర్తు చేసుకుంటూ వారు కూడా వ్యతిరేకతతోనే ఉన్నారు. అయితే కేవలం పేద వర్గాల మాత్రం జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. జగన్ వస్తే చెప్పింది చెప్పినట్లు తమకు ఏదో ఒక పథకం ద్వారా నగదును తమ ఖాతాల్లో వేస్తారని నమ్ముతున్నారు. పేద వర్గాలు మినహాయించి ఎక్కువ శాతం మంది జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. ఈ వర్గాలను ఈ నాలుగేళ్లలో జగన్ ఏ మేరకు మంచి చేసుకుంటారో చూడాలి.
Next Story