Sun Mar 16 2025 23:37:33 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : మీరు వస్తానంటే.. నేను వద్దంటానా?
వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యాలయం గేట్లు ఓపెన్ చేస్తున్నారు. గతంలో పార్టీని వీడిన నేతలను ఒక్కొక్కరుగా చేరిపోయేందుకు సిద్ధమవుతున్నారు

వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యాలయం గేట్లు ఓపెన్ చేస్తున్నారు. గతంలో పార్టీని వీడిన నేతలను ఒక్కొక్కరుగా చేరిపోయేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునేందుకు కూడా జగన్ సిద్ధమయినట్లు తెలిసింది. ఈ మేరకు సంకేతాలను పంపారు. గత ఎన్నికలకు ముందు, తర్వాత వివిధ కారణాలతో పార్టీని వీడి అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్లారు. సామాజికవర్గంగానే మాత్రమే కాకుండా ఆర్థికంగా బలమైన నేతలు కూడా పార్టీని వీడివెళ్లారు. అయితే ఇతర పార్టీలకు వెళ్లిన నేతలు అక్కడ ఆనందంగా లేరు. అక్కడ వారికి ప్రాధాన్యత దక్కడం లేదు. మరొక వైపు వైసీపీకి అంతో ఇంతో మళ్లీ గ్రాఫ్ పెరుగుతుందని భావించి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరగుతుంది.
గత ఎన్నికలకు ముందు.. తర్వాత...
గత ఎన్నికల సందర్భంగా సీట్లు దక్కని వాళ్లు, జగన్ పోకడలను నచ్చని వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోయారు. కూటమి ఏర్పాటుతో తమ ఓటమి ఖాయమయిందని నమ్మిన నేతలు భవిష్యత్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భావించి తమ దారి తాము వెతుక్కున్నారు. జగన్ కూడా వెళ్లిపోయిన నేతలను ఎవరినీ ఆపలేదు. అలాగని రమ్మని పిలవడం లేదు. వారంతట వారు వస్తే మాత్రం తిరిగి పార్టీలో చేర్చుకుంటామని మాత్రం జగన్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎవరైనా వస్తానంటే తాను కాదంటానా? అని నవ్వుతూ ఆయన అనడంతో పార్టీని వీడిన నేతలను తిరిగి చేర్చుకుంటారన్న నమ్మకం నేతల్లో పెరిగింది.
ఆళ్లను చేర్చుకోవడంతోనే...
ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడి వెళ్లి వచ్చినా ఆయనను కూడా తిరిగి పార్టీలో చేర్చుకోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. తాజాగా ఇప్పటికే రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో కాపు రామచంద్రారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. తిరిగి ఆయన వస్తానని కబురు పంపడంతో జగన్ అందుకు అంగీకరించారంటున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ కాపుకు వైసీపీ కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు నేతలు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.
తూ.గో నేత ఒకరిని...
అంటే కూటమి పార్టీకి చెందిన నేతలు ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా ఎన్నికలకు ముందు మాత్రమే వస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో అసంతృప్తిగా ఉన్న ఒక నేతను పార్టీలో చేర్చుకోవడానికి కూడా జగన్ దూతలను పంపినట్లు తెలిసింది. గత ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని గ్రహించి దూతలను పంపారని సమాచారం. దీంతో పాటు ఇతర పార్టీల నేతలను కూడా పార్టీలోకి తీసుకుంటారని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా అనేక మంది నేతలు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఫ్యాన్ పార్టీకి త్వరలో చేరికలు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
Next Story