Fri Nov 22 2024 22:00:08 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : సభకు రానిది అందుకేనా?.. అధికార పార్టీ ర్యాగింగ్ ను తట్టుకోలేమనేనా? జగన్ నిర్ణయమేంటి?
వైసీపీ అధినేత జగన్ ఈరోజు అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయని చెబుతున్నారు
అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశఆయి. అయితే వై నాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయి. జగన్ తో పాటు మరో పది మంది మాత్రమే గెలిచారు. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్ గా హాజరయ్యే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఆయన ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. వైసీపీ నేతల సమావేశంలో జగన్ నేతలతో మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పటం చూస్తుంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు పెద్దగా వచ్చే అవకాశం లేదంటున్నారు. వచ్చినా అవమానాలు, ఛీత్కారాలు తప్ప తాము మరొకటి ఎదుర్కొనలేమని, తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఈరోజు స్పీకర్ ఎన్నిక రోజు కూడా గైర్హాజరయ్యారని చెబుతున్నారు.
గెలిచిన ఎమ్మెల్యేలలో...
గత ఐదేళ్లు తాము చూపిన బాటలోనే ఇప్పుడు అధికార పార్టీ కూడా వెళుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా గత ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ.. రచ్చ మామూలుగా ఉండదు. సమాధానం చెప్పేందుకు కూడా వీలు కాదు. దీంతో జగన్ అండ్ టీం ఈ పరిస్థితిని ఎదుర్కొనడం కష్టంగానే కనిపిస్తుంది. దీనికి తోడు గతంలో కొద్దో గొప్పో గట్టిగా కౌంటర్ ఇచ్చే నేతలు ఎవరూ ఈసారి ఎన్నికల్లో గెలవలేకపోవడం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. గెలిచిన పదకొండు మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. వాళ్లకు సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకునేలోపు పుణ్యం కాలం కాస్తా మించిపోతుంది. అందులోనూ పెద్దగా వాయిస్ లేని వారే ఈసారి జగన్ వెంట ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగు పెడుతుండటం కూడా పార్టీకి అసెంబ్లీలో ఇబ్బందికరంగా మారనుందన్న టాక్ వినిపిస్తుంది.
ఎక్కువ మంది...
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువమంది కొత్త వారే. న పార్టీ అధినేత జగన్ (పులివెందుల)తో పాటు ఆర్. మత్యలింగం (అరకు), ఎం. విశ్వేశ్వర రాజు (పాడేరు), టి. చంద్రశేఖర్ (ఎర్రగొండపాలెం), బి. శివ ప్రసాద్ రెడ్డి (దర్శి), దాసరి సుధ (బద్వేల్), ఎ. అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), వై. బాలనాగి రెడ్డి (మంత్రాలయం), బి. విరూపాక్షి (ఆలూరు), పి. ద్వారకనాథ రెడ్డి (తంబళ్లపల్లి), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు) విజయం సాధించారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా ఎవరూ పెద్దగా మాట్లాడలేని పరిస్థితి. వీరిలో ద్వారకానాధరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి, దాసరి సుధ గతంలో ఎమ్మెల్యేలుగా చేసినా పెద్దగా వాయిస్ లేని వాళ్లు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు కొత్తగా సభలోకి అడుగుపెడుతుండటంతో వీరి మీద పెద్దగా ఆశలు లేవు. వీరికి సభాసంప్రదాయాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితుల్లో వీరితో అసెంబ్లీకి వెళ్లేకంటే జనంలోకి వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నారట.
జనంలో ఉండటమే...
నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి మాత్రం హాజరయి, ఆ తర్వాత సభకు దూరంగా ఉండాలన్నదే జగన్ ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. సభలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకపోగా, తమను రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తారని, దానికి అవకాశం ఇచ్చేకంటే సభకు తాము దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఐదేళ్ల పాటు ఈ ఎమ్మెల్యేలతో సభలో పోరాటం చేయడం కష్టమేనని భావిస్తున్న జగన్ కు చేతనైనా, సులువైన మార్గం జనం బాట పట్టడడమేనని భావిస్తున్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి, ఎన్నికల హామీల అమలు, మిగిలిన సమస్యలపై పోరాటం చేస్తూ జనానికి దగ్గరవ్వాలన్న యోచనలో ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో పాటు తమపై కేసులు నమోదవుతాయని కూడా జగన్ భావిస్తున్నారు. జైలు జీవితానికి కూడా సిద్ధపడాల్సి వస్తుందని నేతలకు చూచాయగా చెప్పినట్లు తెలిసింది. అయితే న్యాయపోరాటం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలోనే జగన్ ఉన్నారు.
Next Story