Ys Jagn : జగన్ “సూపర్” ఛాన్స్ మిస్ చేసుకున్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అసెంబ్లీకి గైర్హాజరై ఆయన సాధించింది ఏందో ఆయనకే తెలియదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అసెంబ్లీకి గైర్హాజరై ఆయన సాధించింది ఏందో ఆయనకే తెలియదు. కేవలం ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మొండిపట్టు పట్టి అది ఇచ్చేంత వరకూ తాను అసెంబ్లీకి రానంటూ భీష్మించుకుని కూర్చోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి సాధారణ అసెంబ్లీ సమావేశాలు కాదు. బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ తీరును విపక్షంగా ఎండగట్టే అవకాశం జగన్ పార్టీకి ఉంది. అయితే దానిని కావాలనుకుని కాలదన్నుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
నిలదీసే అవకాశాన్ని…
నిజానికి తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ఒకరకంగా వైసీపీకి లాభం చేకూరేది. సానుభూతి పుష్కలంగా ప్రజల నుంచి లభించేది. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా శాసనమండలికి మాత్రమే హాజరవుతుండటం చూసి ప్రజల నుంచి సానుభూతి రాకపోగా జగన్ ఇక మారడా? అన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. ఎందుకంటే శాసనసభకు వచ్చి కూర్చుంటే సభలో అనేక ప్రశ్నలు లేవనెత్తే అవకాశముంటుంది. వరద సాయం మీద వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశముంది. అయితే వాయిదా తీర్మానాలు ఇచ్చే అవకాశాన్ని కూడా వైసీపీ కోల్పోయింది.
ఐదు నెలలు కాకముందే…
ఎన్నికలు జరిగి ఐదు నెలలు కూడా కాలేదు. ఇప్పుడే ఇలా తనకు అధికారం దక్కలేదని అలిగి శాసనసభకు రాకుండా కూర్చుంటే వైఎస్ జగన్ కు విమర్శలు తప్ప ప్రశంసలు మాత్రం అందనే అందవు. ప్రజలు కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. శాసనసభలో చర్చ లు ఏకపక్షంగా కొనసాగుతున్నాయి. ఆ అవకాశం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరై నిరసన తెలుపుతూ వాకౌట్ చేసినా కొంత ఉపయోగం ఉండేదన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. జగన్ తాను అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావాలని భావించడం, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని చెప్పడాన్ని ప్రజలు కూడా హర్షించలేకపోతున్నారు.
తాడేపల్లి నుంచే…
అయితే ఇదే విషయాన్ని నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదంటున్నారు. ఎన్నో విషయాలపై అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశాన్ని జగన్ చేజేతులా కోల్పోయారంటున్నారు. హామీలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం దాట వేసే విధానాన్ని ప్రశ్నించవచ్చు. అలాగే బడ్జెట్ లో కేటాయింపులపై నిలదీయవచ్చు. కానీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుంటే ఏం ఒరుగుతుంది? ఏం ప్రయోజనమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి జగన్ తీసుకునే ఇటువంటి నిర్ణయాలతో పార్టీ బలోపేతం కాకపోగా, మరింత బలహీనం అవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.