Sat Nov 16 2024 01:25:20 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు అభిమన్యుడిని కాదు... అర్జునుడిని.. 70 రోజుల్లో కురుక్షేత్రం సిద్ధంగా ఉండండి
ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాలని కోరారు
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాల్సిందేనని తెలిపారు. భీమిలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని, అర్జునుడు అని తెలిపారు. కురుక్షేత్ర యుద్ధంలో గెలుపు ఈసారి కూడా మనదేనని అన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు సహా అందరినీ ఓడించాల్సిందేనని అన్నారు. చంద్రబాబు కొత్త వాగ్దానాలతో గారడి చేయాలని చూస్తున్నారని జగన్ అన్నారు. 75 ఏళ్ల వయసు మళ్లిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఈ యుద్ధానికి తాను సిద్ధమా? అని మీరు సిద్దమా? అని ప్రశ్నించారు.
యుద్ధం ఈ రెండింటి మధ్యే...
మోసం, విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతుందని జగన్ అన్నారు. అటు వైపు కౌరవ సైన్యం ఉందని, ఇటు వైపు పాండవులు ఉన్నారన్నారు. ఈ అర్జునుడికి తోడుగా ప్రజలు కూడా ఉన్నారన్నారు. మీ అందరి అండదండలు ఉన్నంత కాలం తాను తొణకను, బెణకనని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన ప్రతి మంచి పనినీ చెప్పాలన్నారు. మనల్ని మంచిపనులే గెలిపిస్తాయని తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడిని వెంటేసుకుని తిరుగుతున్నాడని జగన్ ఎద్దేవా చేశారు. మరో 70 రోజులలోనే ఎన్నికలు వస్తున్నాయని అన్న జగన్ దానికి అందరూ సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 670 వాగ్దానాలు చేసి పది శాతం కూడా అమలు చేయలేదన్నారు.
సామాజిక న్యాయం....
మనం మ్యానిఫేస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేశామని జగన్ అన్నారు. వారికి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకే అభ్యర్థులు లేరని అన్నారు. యుద్ధానికి వైసీపీ సిద్ధమని ప్రకటించారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు దేశంతో పోటీ పడుతున్నామంటే పాలన ఎలాగుందో అర్థం చేసుకోవాలని కోరారు. ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అందించామని చెప్పారు. 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని అడిగారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానిదేనని అన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ చంద్రబాబు గత పథ్నాలుగు ఏళ్లలో ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు.
ఎక్కడ చూసినా జగన్ మార్కే...
ఎక్కడ చూసినా కనిపించేది వైసీపీ, జగన్ మార్క్ మాత్రమేనని అన్నారరు. రాష్ట్రంలో సుపరిపాలనను తీసుకు వచ్చానని చెప్పడానికి గర్వపడుతున్నానని తెలిపారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని ప్రజలను మోసం చేశాడన్నారు. వైసీపీ అందరి పార్టీ అని అన్నారు. తాను ప్రజలకు సేవకుడిని మాత్రమేనని అన్నారు. కార్యకర్తలను, నాయకులకు పదవులను ఇచ్చే విషయంలో తాము ముందున్నామని తెలిపారు. వైసీీపీ విజయం కోసం కష్టపడిన వారందరికీ రాజకీయంగా అవకాశాలు కల్పించామని చెప్పారు. లబ్ది పొందిన వాళ్లంతా స్టార్ క్యాంపెయినర్లుగా మారాలన్నారు. మళ్లీ జగన్ ఎందుకు అధికారానికి రావాలో చెప్పాలన్నారు. వైసీపీకి ఓటు వేయకపోతే స్కీమ్ లు వద్దని చెప్పినట్లేనని అన్నారు. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాలను గెలవాలన్నారు. అన్ని అసెంబ్లీ సీట్లు మనమే గెలిచి తీరాలని అన్నారు.
Next Story