Thu Dec 19 2024 10:44:31 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : బెంగళూరు పోయి కూర్చుంటే.. ఇక్కడ పార్టీ ఖాళీ కాక ఏమవుతుంది బాసూ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారు. ఆయన ఏదైనా పని ఉంటే తప్ప తాడేపల్లి ప్యాలెస్ కు రావడం లేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారు. ఆయన ఏదైనా పని ఉంటే తప్ప తాడేపల్లి ప్యాలెస్ కు రావడం లేదు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి రెండు నెలలయినా ఇంకా పార్టీ నేతలతో సమావేశం పెట్టలేని పరిస్థితి. వారితో మాట్లాడి నియోజకవర్గాలు, జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించాల్సిన వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లి సేదతీరడంపై పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ని వదిలి అసలు బెంగళూరుకు వెళ్లాల్సిన పని ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా పార్టీ అధినేత అందుబాటులో లేకపోవడంతో నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు.
అనేక మంది నేతలు...
గుంటూరు జిల్లా నుంచి మద్దాలి గిరి, కిలారు రోశయ్య, దొరబాబు, తాజాగా ఆళ్ల నాని వంటి వారు పార్టీ నుంచి వెళ్లి పోయారు. తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇది ఒకరకంగా పార్టీ క్యాడర్ కు మానసికంగా దెబ్బేనని అనుకోవాలి. లీడర్ అందుబాటులో ఉంటేనే నేతలు తమ సమస్యలను చెప్పుకునే వీలుంటుంది. కానీ వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ఉండటంపై పార్టీలో చర్చ జరుగుతుంది. 2014లో ఓటమి పాలయినా జగన్ లో ఇంత మార్పు చూడలేదంటున్నారు. నాడు జనంలో ఉండేేందుకే వైఎస్ జగన్ ఇష్టపడే వారు. కానీ ఇప్పుడు జనంలోకి రావాలంటేనే కొంత ఇబ్బంది పడుతున్నారు.
నియోజకవర్గాల్లో ఉండకుండా...
ఎక్కువ మంది నేతలు నియోజకవర్గాల్లోనే ఉండటం లేదు. దీంతో క్యాడర్ లో అధికార పార్టీని ఎదుర్కొనలేక వారు కూటమిలో ఏదో ఒక పార్టీ వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది నేతలు హైదరాబాద్ లో ఉంటున్నారు. కనీసం పార్టీ కార్కక్రమాలను కూడా నిర్వహించడం లేదు. నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళనలు కూడా చేయడం లేదు. దీంతో క్యాడర్ మొత్తం జారుకునే పరిస్థితి ఏర్పడింది. అసలు వైఎస్ జగన్ తాడేపల్లిలో ఉండి నిత్యం నేతలతో జిల్లా స్థాయిలోనైనా సమావేశాలను నిర్వహిస్తే కొంత వరకూ లీడర్లలో జవాబుదారీ తనం ఉంటుంది. కానీ వైఎస్ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఇక లీడర్లు ఎందుకు నియోజకవర్గాల్లో ఉంటారన్న ప్రశ్న తలెత్తుతుంది.
చంద్రబాబును చూసైనా?
2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత చంద్రబాబు అన్ని జిల్లాలకు తిరిగారు. నేతలతో ఓటమిపై సమీక్షలు నిర్వహించారు. తరచూ నియోజకవర్గాల పర్యటన చేస్తూ వచ్చారు. అప్పుడే నేతలు నిలబడ్డారు. క్యాడర్ లో కూడా ధైర్యం నింపడానికి నాడు చంద్రబాబు చేసిన పనిని ఇప్పుడు వైఎస్ జగన్ ఎందుకు చేయలేకపోతున్నారు? అని క్యాడర్ ప్రశ్నిస్తుంది. బెంగళూరులో జగన్ ఉంటే నియోజకవర్గాల్లో నేతలు ఉండి ఏం చేస్తారు? తమకు దిశానిర్దేశం చేసే నేత లేరని అనేక నియోజకవర్గాల్లో లీడర్లు వాపోతున్నారు. కొందరు మాత్రమే నియోజకవర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటంతో టీడీపీ వైపు నేతలు చూస్తున్నారు. ఇప్పటికైనా జగన్ బెంగళూరును వదిలి ఏపీలో పార్టీపై ఫోకస్ పెడితే తప్ప వైసీపీ బాగుపడదు. లేదంటే ఇక అంతే.
Next Story