Fri Nov 22 2024 20:18:02 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ కీలక నిర్ణయం.. అసెంబ్లీ సమావేశాలకు దూరం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్న జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి కూడా అధికార పార్టీకి మనసొప్పడం లేదన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కనీసం మాట్లాడేందుకు కూడా సభలో సమయం ఇవ్వరని తమకు తెలియంది కాదు అని ఆయన అన్నారు. అందుకే బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా తాము ప్రతి రోజూ మీడియా సమావేశం పెట్టి ప్రజలకు రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని జగన్ తెలిపారు.
అక్రమ అరెస్ట్‌లతో..
రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్న జగన్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై అక్రమ కేసులను బనాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించినంత మాత్రాన అరెస్ట్‌లు చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రశ్నించినా అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ఇసుక, మద్యం మాఫియా పై నిలదీసిన వారిని జైల్లో పడేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారన్న జగన్ సంపదను సృష్టించడమంటే ఇదేనా? అని జగన్ నిలదీశారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారన్న జగన్, మద్యం పాలసీ పేరుతో అక్రమంగా లైెసెన్సులు ఇచ్చి నాన్నకు ఫుల్లు - అమ్మకు నిల్లు అని పోస్టు చేసినందుకు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను అరెస్ట్ చేయడమేంటన్నారు.
పవన్ మంత్రిగా ఉన్నారా?
రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాట్లాడటమేంటని? దీనిని బట్టి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది కదా? అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాకుండా ఉందన్న జగన్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. పవన్ కల్యాణ్ సరస్వతి పవర్ భూముల్లో పర్యటించారని, కానీ అక్కడ అన్నీ పట్టా భూములేనన్న జగన్ వెయ్యి ఎకరాల్లో నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జగన్ అన్నారు. ఆ ప్రభుత్వ భూమిని తీసుకోలేదని కూడా జగన్ వివరించారు. అక్కడకు వెళ్లిన పవన్ తనపై తప్పుడు ప్రచారం చేశారన్న జగన్ పవన్ కల్యాణ్ అసలు మంత్రి ఎలా అయ్యాడో అంటూ ఎద్దేవా చేశారు.
Next Story