Mon Dec 23 2024 09:34:33 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు అభ్యర్థుల అధికారిక ప్రకటన.. ఎవరి పేరు ఉంటుందో.. ఊడుతుందో.. తెలియదట...టెన్షన్..టెన్షన్
వైసీపీ అధినేత జగన్ నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో నేతల్లో టెన్షన్ పట్టుకుంది
వైసీపీ అధినేత జగన్ నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. శాసనసభ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఒకే విడతలో ఆయన ప్రకటించనున్నారు. ఇడుపులపాయకు నేడు చేరుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన జాబితాను విడుదల చేయనున్నారు. ఒకే విడత 25 పార్లమెంటు నియోజకవర్గాలకు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ ప్రకటన తర్వాత ఈ నెల 18వ తేదీ నుంచి ఆయన ప్రచారానికి బయలుదేరి వెళతారు. 18వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సమన్వయకర్తలను నియమిస్తూ...
ిఇప్పటికే గత కొన్ని నెలలుగా పార్టీ సమన్వయ కర్తలను మారుస్తూ జగన్ అభ్యర్థులను అనధికారికంగా ప్రకటించేశారు. దాదాపు డెబ్బయి శాసనసభ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చారు. పార్లమెంటు స్థానాల్లోనూ ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థులను మార్చారు. ఇప్పటి వరకూ పన్నెండు జాబితాలతో సమన్వయ కర్తలను దశలవారీగా ప్రకటించారు. సీటు దక్కని వారితో సంప్రదింపులు జరిపి, వారిని బుజ్జగించి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను నియోజకవర్గాలను మార్చి అక్కడ పోటీకి దింపాలని జగన నిర్ణయించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలలో...
దీంతో ఫైనల్ లిస్ట్ నేడు విడుదల కానుంది. వివిధ రకాల సర్వేలను అనుసరించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే చివరి జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశముందన్న వార్తలతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఫైనల్ లిస్ట్ లో తమ పేరు ఉంటుందా? లేదా? అన్న ఉత్కంఠ అందరిలోనూ కనపడుతుంది. జగన్ మాత్రం అందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని, రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కొందరికి సీట్లను కేటాయించడం కూడా ఈసారి జగన్ తీసుకున్న మరో నిర్ణయంగా చెప్పాలి.
ఎడా పెడా మార్చేసి...
రెండోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో జగన్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఏమాత్రం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే ఈసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్న జగన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎవరి మాట వినలేదు. ఉండేవారు ఉంటారు.. వెళ్లేవారు వెళతారు అన్న రీతిలోనే ఆయన సెలక్షన్ సాగింది. అయితే కొందరు సీట్లు దక్కకపోవడంతో పార్టీని వీడి వెళ్లారు. అసంతృప్తులు కూడా తలెత్తాయి. వీటిని అన్నింటినీ అధిగమించి మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయించి ఈసారి సరికొత్త తరహాలో గేమ్ ప్లాన్ ను మార్చి ఎన్నికలకు వెళుతున్న జగన్ ను ప్రజలు ఏ మేరకు ఆశీర్వదిస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
Next Story