Fri Dec 20 2024 06:36:03 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP :రేపటి నుంచి "వై ఏపీ నీడ్స్ జగన్"
రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు
రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలను అందచేశామని తెలిపారు. ఇటు రాష్ట్ర అభివృద్ధిని మెరుగుపరుస్తూనే అటు సంక్షేమంపై దృష్టి పెట్టిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేమీ లేదన్నారు.
సంక్షేమమే అభివృద్ధి...
సంక్షేమమే అభివృద్ధి అని తాము రుజువు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయంలో రాష్ట్రం పదిహేడో స్థానంలో ఉంటే ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అభివృద్ధి చెందామని ఆయన గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. మ్యానిఫేస్టోను జగన్ పవిత్ర గ్రంధంగా భావించారన్నారు. కోవిడ్ సమయంలో వ్యవస్థలన్నీ కుదేలయిపోయినా అందరినీ ఆదుకున్న ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ప్రజలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రోల్ మోడల్ గా...
కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. వ్యవసాయ రంగంలో గతంలో 27వ స్థానంలో ఉంటే ఇప్పుడు ఆరో స్థానంలో ఉన్నామని తెలిపారు. 2019లో జీఎస్డీపీలో ఏపీ 22వ స్థానంలో ఉంటే ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేర్చిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. పూర్తి పారదర్శక పాలనలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా లక్షల కోట్ల రూపాయలను పేద ప్రజల ఖాతాల్లోకి చేరాయన్నారు. తాము చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఉండాలంటే జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story