Sat Dec 28 2024 06:57:47 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : "అంతరంగాలు" సీరియల్ ను తలపిస్తున్న జాబితాల విడుదల వ్యవహారం
మేరుగ, పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను విడుదల చేశారు
వైసీపీ ఆరో జాబితాను విడుదల చేసింది. మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను విడుదల చేశారు. నాలుగు ఎంపీలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇన్ ఛార్జులను ప్రకటించింది. ఇప్పటికే ఐదు జాబితాను విడుదల చేసిన వైసీపీ ఆరో జాబితాను కూడా రిలీజ్ చేయడంతో ఇంకెన్ని లిస్ట్ లు ఉంటాయన్న చర్చ జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ వెలువడేంత వరకూ మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. సర్వేల మీద సర్వేలు చేయిస్తూ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఎలాంటి శషభిషలకు తావివ్వకుండా తాము అనుకున్న ప్రకారమే జగన్ ముందుకు వెళుతున్నారు. ఆరో జాబితా కొంత ఆలస్యమవుతుందని భావించినా ఈరోజు కూడా జాబితాను విడుదల చేయడంతో వైసీపీ నేతలు తమ టిక్కెట్ ను ప్రకటించేంత వరకూ టెన్షన్ పడక తప్పదు.
అసంతృప్తి వ్యక్తమవుతున్నా...
ఇప్పటి వరకూ విడుదల చేసిన ఐదు జాబితాల్లో 61 అసెంబ్లీ స్థానాలు, పథ్నాలుగు పార్లమెంటు స్థానాల్లో మార్పులను, చేర్పులను వైసీపీ అధినేత జగన్ చేపట్టారు. గత నెలన్నరుగా ఇదే విధంగా జాబితాలను విడుదల చేస్తున్నారు. మంగళగిరితో మొదలు పెట్టారు. మరి దీనికి ముగింపు దేనితో పలుకుతారో తెలియదు కానీ.. ఉన్నోళ్లను మార్చడం.. మళ్లీ ఇప్పటికే ప్రకటించిన లిస్ట్ లలో మార్పులు చేస్తుండటంతో నియోజకవర్గాల్లోనూ టిక్కెట్ దక్కని అనుచరులు వీధుల్లోకి వచ్చి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మడకశిరలోనూ ఇలాగే వైసీపీ నేతలు బయటకు వచ్చి అధినాయకత్వం సెలక్షన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి.
జనంలోకి వెళ్లడానికే...
అభ్యర్థులను మార్చిన చోట సిట్టింగ్ ఎమ్మెల్యేను, కొత్త ఇన్ ఛార్జి కలసి పని చేయడం లేదు. ఇద్దరివీ వేర్వేరు దారులుగా కనిపిస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించకుండా, పరిస్థితులను సరిదిద్దకుండా జాబితాల మీద జాబితాలు విడుదల చేయడం ఎందుకన్న ప్రశ్నలు నేతల నుంచి ఎదురవుతున్నాయి. అయితే త్వరగా అభ్యర్థులను మార్చేసి జనంలోకి వెళ్లేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఇన్ ఛార్జులు జనంతో మమేకం అవ్వాలంటే వారికి సమయం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఆయన ముందు నుంచే అభ్యర్థులను రెడీ చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ లో ఇంకా ఎన్ని జాబితాలు విడుదలవుతాయి? సీిరియల్ గా సాగుతున్న దీనికి ఎండ్ కార్డు పడేదెప్పుడు? అని పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
శాసనసభ స్థానాలు
01. జీడీ నెల్లూరు - నారాయణ స్వామి
02. మైలవరం - తిరుపతి రావు యాదవ్
03. మార్కాపురం - అన్నారాంబాబు
04. గిద్దలూరు - నాగార్జున రెడ్డి
05. నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్
06. ఎమ్మిగనూరు - బుట్టా రేణుక
పార్లమెంటు స్థానాలు
07. రాజమండ్రి - గూడూరి శ్రీనివాస్
08. గుంటూరు - ఉమ్మారెడ్డి రమణ
09. నరసాపురం - గూడూరి ఉమాబాల
10. చిత్తూరు - రెడ్డప్ప
Next Story