Thu Dec 12 2024 11:42:38 GMT+0000 (Coordinated Universal Time)
Avanthi Srinivas : అవంతి రాజీనామా చేయడానికి అసలు కారణమదేనట... త్వరలోనే చేరిక
వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నానే
వైసీపీ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అధికారం కోల్పోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ ఆరు నెలల నుంచి కారణాల కోసం వెతుక్కుంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఆందోళనలకు పిలుపునివ్వడం తనకు నచ్చలేదని ఆయనచెప్పారు. అందులో నిజం లేదు. నిజానికి గతంలోనూ చంద్రబాబు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నెల రోజులు గడవక ముందే జనంలోకి వచ్చిన విషయాన్ని అవంతిశ్రీనివాస్ మర్చిపోయినట్లుంది. చెప్పిన కారణం కూడా ఎవరూ నమ్మేట్లు లేదు.
జనసేనలోచేరేందుకు...
అయితే తాను ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని అవంతి శ్రీనివాస్ చెప్పడం కూడా సత్యదూరమేనని అంటున్నారు. ఎందుకంటే ఆరు నెలల నుంచి ఆయన జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. 2014 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన 2009 లో ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ముత్తం శెట్టి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం త్వరలోనే జనసేనలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారని, జనసేన నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
మరోసారి భీమిలీ నుంచి...
అవంతి శ్రీనివాస్ బలమైన రాజకీయనాయకుడు, ఆర్థికంగా, సామాజికపరంగా కూడా బలవంతుడు కావడంతో ఆయన చేరికకు ఎవరూ పెద్దగా అభ్యంతరం తెలిపే అవకాశం లేదు. టీడీపీలో చేరాలంటే అక్కడ గంటా బ్యాచ్ అడ్డంపడే అవకాశముంది. అదే జనసేనలో తనకు తిరుగుండదని అవంతి శ్రీనివాస్ లెక్కలు వేసుకున్నారు. తాను జనసేనలో చేరితే మరోసారి భీమిలి నియోజకవర్గం నుంచిగెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. కూటమి పార్టీల అభ్యర్థిగా తాను భీమిలీ టిక్కెట్ ను తెచ్చుకోగలిగితే గ్యారంటీ గెలుపు అని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన జనసేన నేతలకు దగ్గరగయ్యారంటున్నారు. త్వరలోనే ఆయన పవన్ కల్యాణ్ ను కూడా కలిసే అవకాశముందని తెలిసింది.
వైసీపీలో ప్రయారిటీ దక్కదని...
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడత మంత్రివర్గంలో అవంతి శ్రీనివాస్ చోటు దక్కింది. అప్పుడు పార్టీ, అధినేత ఇద్దరూ మంచిగానే కనిపించారు. కానీ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. ఆయనకు విశాఖ లోనే గుడివాడ అమరనాథ్ పోటీ ఉన్నారు. వైసీపీలోనే కొనసాగితే తనకు పదవులు భవిష్యత్ లో రావన్న నమ్మకం ఆయనలో ఎక్కువయిందంటున్నారు. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కాదని, శ్రీకాకుళం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల కూడా అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీలో తనకు భవిష్యత్ లేదని భావించిన అవంతిశ్రీనివాస్ తన దారి తాను చూసుకున్నాడు.
Next Story