Mon Dec 23 2024 06:19:36 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala Rama Krishna Reddy : సజ్జల నోటి వెంట నీతులు.. నమ్మండ్రోయ్
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి. ఆయనపైనా, వైసీపీ నేతలపైనా అక్రమకేసులు బనాయిస్తున్నారంటూ ఆయన ఆరోపించడమే ఈ నవ్వులకు కారణం. సజ్జల సీరియస్ గా ఈ కామెంట్స్ చేసినా చూసే వాళ్లకు మాత్రం నవ్వులాటగానే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు విచారణకు పిలవడం ఆయనకు నచ్చలేనట్లుంది. అది ఆయనకు అక్రమంగా అనిపించవచ్చు. కానీ గత ఐదేళ్లలో నువ్వు చేసిందేమిటి? నీరజాక్షా? అన్న సామెతను మాత్రం సీనియర్ జర్నలిస్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మర్చిపోతున్నట్లుంది.
అంతా తానే అయి...
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా సజ్జల తానే అయి నడిపించారు. సకల శాఖా మంత్రిగా ఆయన వెనక ట్యాగ్ లైన్ కూడా తగిలించుకున్నారు. దీంతో పాటు ఇక హోంశాఖ అంటే సజ్జల చెప్పినట్లు నడవాల్సిందే. ఆయన డైరెక్షన్ లోనే కేసులన్నీ నాడు టీడీపీ నేతలు, కార్యకర్తలపై కూడా నమోదయ్యాయి. ఒకటికాదు.. రెండు కాదు.. టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కేసులు నమోదు చేశారు. అవన్నీ సక్రమమైన కేసులా? న్యాయస్థానంలో నిలబడ్డాయా? అప్పుడు వాటిని ఎందుకు పెట్టారు. ఆ పార్టీపై కక్ష సాధింపు చర్యల కోసమే కదా? అన్న ప్రశ్నకు మాత్రం పాపం సజ్జల వద్ద సమాధానం లేనట్లుంది.
నాటివి విస్మరించి...
అందుకే గతంలో తాము చేసిన కార్యక్రమాలను గురించి సజ్జల రామకృష్ణారెడ్డి విస్మరించినట్లున్నారు. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొల్లు రవీంద్రపై హత్యా యత్నం మోపారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర పైన కూడా డెయిరీ విషయంలో కసి తీర్చుకున్నారు. ఇలా కీలక నేతలను ఎవరినీ వదలిపెట్టలేదు. జగన్ కు తెలియదని చెప్పలేం కానీ, సజ్జల డైరెక్షన్ లోనే నాటి పోలీసు యంత్రాంగం నడిచిందన్న విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. అందరి వేళ్లూ సజ్జల వైపే చూపించారు కూడా. కానీ జగన్ అధికారంలో ఉండగా ఆయనను పక్కన పెట్టకుండా మరింత కీడు తెచ్చుకున్నారు.
అక్రమ కేసులంటూ...
ఇప్పుడ సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంట నీతులు వల్లిస్తే నమ్మేదెవరంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నాడు తాము ఎంత బాధపడ్డామో ఇప్పుడు అర్థమయిందా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలను వేధించడం ప్రారంభించింది ఎవరు అన్న ప్రశ్న సజ్జల రామకృష్ణారెడ్డికి సూటిగానే తగులుతుంది. కానీ సజ్జల మాత్రం అవన్నీ మర్చి పోయి ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోయిందని, తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. కేసులుంటే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలి తప్పించి ఇలా అక్రమ కేసులంటూ గగ్గోలు పెడితే సొంత పార్టీ కార్యకర్తలే సజ్జల మాటలను విశ్వసించే పరిస్థితిలో లేరన్నది వాస్తవం.
Next Story