Sun Dec 22 2024 21:30:19 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఓరయ్యో.. జమిలీ కాదు.. ముందు క్యాడర్ ఎక్కడ్రా బాబూ?
జమిలి ఎన్నికలు వస్తాయంటూ వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారు.
జమిలి ఎన్నికలు వస్తాయంటూ వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారు. 2027 నాటికి జమిలి ఎన్నికలు జరుగుతాయని కార్యకర్తలు అందరూ సమాయత్తం కావాలని వైసీపీ అగ్రనేతలందరూ పిలుపు నిస్తున్నారు. కానీ క్యాడర్ వీరి మాటలను పట్టించుకునే పరిస్థితుల్లో ఉందా? అన్న అనుమానం మాత్రం కలుగుతుంది. 2014లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. 2019 వరకూ అది కొనసాగింది. అయితే 2019 నుంచి 2024 వరకూ జరిగిన జగన్ పాలన తర్వాత క్యాడర్ అంటూ ఏమీ లేకుండా పోయింది. ఉన్న క్యాడర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సొంత సామాజికవర్గం నేతలే వైసీపీ నేతలను విశ్వసించడం లేదు.
ఐదేళ్లు దూరంగా పెట్టి...
అధికారంలోకి తెచ్చిన క్యాడర్ ను ఐదేళ్ల పాటు పట్టించుకోక పోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల పాటు వైసీపీ అధినాయకుడి నుంచి కింది స్థాయి నేత వరకూ క్యాడర్ అస్సలు కనిపిస్తే కదా? వారి స్థానంలో వైసీపీ నేతలకు కనిపించింది సొమ్ములు మాత్రమే. వాలంటీర్లను మధ్యలో తెచ్చి పెట్టి క్యాడర్ ను తమంతట తామే దూరం చేసుకున్నారు. సామాజికవర్గాల పేరుతో నమ్ముకున్న వారిని పక్కన పెట్టాడు జగన్. దీంతో నమ్మకమైన క్యాడర్ తో పాటు కీలకమైన నేతలు కూడా తాము ఇంత చించుకున్నా పోయేది గొంతు అని భావించి వారు మౌనంగా ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
పూర్తిగా నిర్వీర్యం చేసి...
2024లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు తప్పించి క్యాడర్ కనిపించ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా అన్ని తెలిసి కూడా ఇప్పుడు జమిలి ఎన్నికలు వస్తాయి సిద్ధం కండి అంటూ నేతలు పిలుపునిస్తే క్యాడర్ లగెత్తుకుంటూ కాలర్ ఎగరేసుకుని వస్తారనుకుంటున్నారేమో. ఆ ఒక్కటీ అడక్కు అంటూ నవ్వేసి వెళ్లిపోతారు. ఈ విషయం తెలిసి కూడా పెద్దలు పదే పదే జమిలి ఎన్నికల ప్రస్తావన తేవడం మాత్రం విడ్డూరంగా ఉందంటున్నారు. అసలు వైసీపీకి అలవాటులేని పదం కార్యకర్తలు.. పార్టీ నిర్మాణం. గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మించాలని తరచుగా అంటుండమే కాని కేవలం జమిలి ఎన్నికల కోసమే మళ్లీ జమిలీ జపం వైసీపీ నేతలు చేపట్టినట్లుందని కార్యకర్తలు ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి వస్తారు.
కుదిరే పనేనా?
కేవలం జమిలి ఎన్నికల పేరుతో కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సిద్ధం చేయాలంటే కుదరని పని. నేతల అవసరం వచ్చిప్పుడు.. అదీ ఎన్నికలు అన్నప్పుడు మాత్రమే కార్యకర్తలు అని పెదవి నుంచి వారి నోటి నుంచి వస్తుంటే వారు ఎందుకు కదులుతారన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుంది. అసలు నేతలు కార్యకర్తలను కలిసేది ఉందా? వారి సమస్యలను, బాగోగులను పట్టించుకున్న పాపాన పోయారా? ఎవరో ఒకరిద్దరు నేతలు మినహాయించి మిగిలిన వైసీపీ నేతలందరూ కార్యకర్తలను వదిలేశారు. వైసీపీకి గతంలో ఉన్న కార్యకర్తలు ప్రస్తుతం నిస్తేజంలో ఉన్నారు. ఇలాగే కొనసాగి అది నిరాశగా మారుతుంది. మరికొన్నాళ్లకు నిరాశ పెరిగి నిష్ప్రయోజనమన్న భావన కలిగిందంటే జెండా కూడ పట్టుకోరు. ఆ పరిస్థితిని తెచ్చుకోకుండా వైసీపీ అగ్ర నేతలు జమిలి జపం మరచిపోయి కార్యకర్తలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే వైసీపీని వచ్చే ఎన్నికల్లోనూ ఎవరూ రక్షించలేరన్నది కాదనలేని వాస్తవం.
Next Story