టీడీపీ మేనిఫెస్టో.. వైసీపీ నేతల కౌంటర్లు
మహానాడులో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు వేశారు. డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో వ్యంగస్త్రాలు
మహానాడులో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు వేశారు. డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో వ్యంగస్త్రాలు సంధించారు. 2014లో 650 వాగ్దానాలు గాలికొదిలేశాడని మండిపడ్డారు. 650 వాగ్దానాల్లో 10 హామీలైనా నెరవేర్చలేదని, మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు చరిత్రే నకిలీ చరిత్ర అని, ఆయన ఓ డర్టీ ఫెలో, దొంగ అని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే సీఎం జగన్ చేసి చూపించారని అన్నారు. ఆల్ కాపీ బాబు, నకిలీ బాబుకు 2024లో పరాభవం తప్పదన్న మంత్రి.. వచ్చే ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. రుణమాఫీ అంటూ రైతులను చంద్రబాబు మోసం చేశాడని, 2024 ఎన్నికల్లో బీసీలు చంద్రబాబును తరిమి తరిమి కొడతారని అన్నారు. పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడని, చంద్రబాబు వేషాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందన్నారు. కేబినెట్లో ఒక్క బీసీకైనా చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చాడా? అని మంత్రి జోగి ప్రశ్నించారు. కేబినెట్లో సామాజిక న్యాయం చేసిన సీఎం వైఎస్ జగన్ అని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పాడంటే.. చేసి చూపెడతారని అన్నారు. పేదలను సంపన్నులుగా చేయగలిగే ఓకే ఒక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు మహా నటుడు అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మహానాడులో ఆయన ప్రకటించిన మేనిఫెస్టో హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ ఉచిత హామీలు ప్రకటిస్తున్నారన్న మంత్రి.. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదని విమర్శించారు. పేద ప్రజలను చంద్రబాబు అణగ దొక్కాలని చూస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. పేదలను అవహేళన చేయాలనే ఆలోచన చంద్రబాబుదని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడని, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబుకు సిగ్గు రాలేదన్నారు.
మేనిఫెస్టో హామీలను అమలు చేసిన చరిత్రే చంద్రబాబుకు లేదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. దమ్ముంటే మేనిఫెస్టో హామీల అమలుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబుది వెన్నుపోటు మేనిఫెస్టో అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు. మహానాడులో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పాడని అన్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. పచ్చి అబద్దాలతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని, చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని నారాయణస్వామి పేర్కొన్నారు. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 2014లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇప్పుడు మహానాడు వేదికగా ఉచిత హామీలు ప్రకటిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98 శాతంకుపైగా అమలు చేశారని మంత్రి పెద్ది రెడ్డి పేర్కొన్నారు.