Sun Dec 22 2024 18:24:52 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : సీమ నేతల్లో అసహనం.. అంతా ఆయనే చేశారంటున్నారుగా? అందుకే దూరంగా ఉంటున్నారా?
ఈ ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణం జగన్ అని చెబుతున్నారు రాయలసీమ జిల్లాకు చెందిన నేతలు
వైసీపీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో దారుణ ఓటమిని చవి చూసింది. అయితే ఈ ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణం జగన్ అని చెబుతున్నారు రాయలసీమ జిల్లాకు చెందిన నేతలు. రాయలసీమ జిల్లాల్లో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి జగన్ వైఖరి కారణమని కొందరు అంటుంటే.. లేదు..లేదు.. అసలు కారణం సీఎంవో అధికారులేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. జగన్ ఓటమి తర్వాత వరసగా పార్టీ మీటింగ్ లు పెడుతున్నా రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు మాత్రం దూరంగానే ఉన్నారు. వాళ్లు పెద్దగా పాల్గొనడం లేదు. అలాగని వాళ్లు ఊరికే ఉండటం లేదు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తమలో ఉన్న అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.
ఈ ప్రాంత నేతలు మాత్రం...
ఉత్తరాంధ్రలో ఓటమి పాలయ్యారంటే అందుకు వేరే కారణాలుంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటమికి పవన్ ప్రభావం అని సరిపుచ్చుకుని నేతలు తమకు తాము సర్దిచెప్పుకుంటున్నారు. కోస్తాంధ్రలో అమరావతి రాజధాని ప్రభావం, కమ్మ సామాజికవర్గం పోలరైజ్ అయి అంతా ఒక్కటవ్వడంత పార్టీ దారుణ ఓటమికి కారణంగా చూడాలి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ ఇంతటి ఓటమిని ఊహించలేదు. కానీ అనేక కారణాలు తమ ఓటమికి కారణాలు అని చెబుతున్నారు. అయితే నెల్లూరును రాయలసీమ జిల్లాగానే చూడాలి. పేరుకు రాయలసీమ జిల్లాలు నాలుగే అయినా నెల్లూరును ఖచ్చితంగా సీమలో కలుపుకోవాల్సిందే.
గత ఎన్నికల్లో...
కానీ కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఓటమి మాత్రం జగన్ వల్లనేనని అక్కడి నేతలు కుండబద్దలు కొడుతున్నారు. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఎప్పుడూ ఈ పరిస్థిితి లేదు. ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తప్పించి మిగిలిన ఎన్నికల్లో కాంగ్రెస్, తర్వాత వైసీపీ కడప జిల్లాలో సత్తా చాటాయి. 2019 ఎన్నికల్లో టీడీపీకి రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో వచ్చింది కేవలం మూడు స్థానాలు మాత్రమే. కానీ ఈసారి అన్ని జిల్లాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి జగన్ వైఖరి కారణమని వారు చెబుతున్నారు. జగన్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి దూరంగా ఉండటంతో పాటు ప్రధాన మైన సామాజికవర్గం రెడ్లను కూడా దూరం చేసుకున్నారంటున్నారు.
సీఎంవోలో పట్టించుకోక...
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నుంచి అందరిదీ ఇదే మాట. జగన్ పూర్తిగా సీఎంవో అధికారులపై ఆధారపడి ఈ ప్రాంత నేతలను పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి పరిస్థితి తలెత్తిందని వారు కుండబద్దలు కొట్టేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో దాదాపు సిట్టింగ్ లకే అవకాశం కల్పించినా ఐదేళ్లు అస్సలు తమను పరిగణనలోకి తీసుకోలేదని, నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తాము చేసిన ప్రతిపాదనలు సీఎంవోలో ఒక అధికారి అస్సలు పట్టించుకోలేదంటున్నారు. దీంతో పాటు సామాజికవర్గాల సమీకరణ అని, పెత్తందార్లు, పేదలంటూ ప్రధాన సామాజికవర్గాలను దూరం చేసుకుని తమ ఓటమికి కూడా జగన్ కారణమయ్యారని వారు చెబుతుండటంతో ఇప్పుడు వైసీపీ చీఫ్ వారిని సముదాయించాల్సిన అవసరం ఏర్పడింది.
Next Story