Sun Dec 22 2024 21:44:12 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : అప్పుడు ఆ ఫొటోయే గెలిపించింది.. ఇప్పుడు అదే ఓడించింది.. అదెలాగంటే?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. గతంలో ఎప్పుడూ చూడని అవమానం ఎదురయింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. గతంలో ఎప్పుడూ చూడని అవమానం ఎదురయింది. అందులో ఎవరిపై వ్యతిరేకత ఉందో.. ఇట్టే అర్థమవుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత వెలువడుతున్న విశ్లేషణలు అన్ని వేళ్లూ జగన్ వైపు చూపుతున్నాయి. 2019 ఎన్నికల్లో అదే జగన్ ఫొటోతో 151 స్థానాలు సాధించిన వైసీపీ, 2024 ఎన్నికలకు వచ్చే సరికి అదే ఫొటో 11 స్థానాలకే పరిమితం చేసింది. దీనికి కారణాలు అనేకం. చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉన్నప్పటికీ కొన్ని మచ్చుకు చెప్పుకోవాల్సిందే. జగన్ వద్దకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. జగన్ కే కాదు ఇప్పుడంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి మీద ఎమ్మెల్యేలు నెపం నెడుతున్నారు కానీ అసలు ఓటమి కారణం జగన్ దే.
కలిస్తే చెప్పేవారా?
జగన్ మాత్రమే కాదు.. చంద్రబాబు వద్ద కూడా నేతలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు వీలులేదు. ప్రాంతీయ పార్టీల్లో ఇది సర్వసాధారణం. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి దరిద్రంగా ఉన్నా మొహంపై నవ్వుపులుముకుని ఆల్ ఈజ్ వెల్ అంటూ వెళ్లిపోతారు. లేదు వాస్తవం చెప్పిన వాళ్లకు చివరకు సీటు కూడా దక్కదు. అందుకే నేతల నుంచి ఫీడ్ బ్యాక్ జగన్ కు వస్తుందని అనుకోవడం పొరపాటే అవుతుంది. నిజంగా ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రమేయం లేకుండా జగన్ ను కలిసినా పార్టీ పరిస్థితి నేతలు చెప్పలేరు. ఎందుకంటే మొహమాటం కాదు..తమ సీటుకు ఎసరు వస్తుందని వారి భయం. అందుకే ఇతరులపై నెపం నెట్టడమనేది ఓటమిని వెతుక్కోవడానికి ఒక కారణాలు.
కారణాలు వింటుంటే...
ఓటమి తర్వాత ఇప్పుడు నేతలు అంటున్న కారణాలు వింటుంటే నవ్వొస్తుంది. ఓటమికి గల కారణం వాలంటీర్లు అని చెబుతున్నారు. కానీ అదే వాలంటీర్ల వ్యవస్థను ఇదే నేతలు తెగ పొగిడారు. వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. వాలంటీర్ల కారణంగానే గెలుస్తున్నామంటూ ఫలితాల ముందు వరకూ చెప్పుకొచ్చారు. కానీ దారుణ ఓటమి తర్వాత వాలంటీర్ల వ్యవస్థ వల్ల క్యాడర్ పార్టీకి దూరమయిందని, వాళ్లు ఈ సారి సక్రమంగా పనిచేయలేదని సాకులు చెబుతున్నారు. అదే గెలిచి ఉంటే ఇదే వాలంటీర్ల వ్యవస్థను విమర్శిస్తున్న ఇవే నోళ్లు మళ్లీ పొగుడుతూనే ఉండేవి. ఒకవేళ నిజంగా వాలంటీర్ల వ్యవస్థ పార్టీని అంత డ్యామేజీ జరుగుతుందని భావిస్తే జగన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్న ప్రశ్న ప్రశ్నగానే మిగులుతుంది.
ప్రజలతో సంబంధాలుంటే...
పోనీ.. ధనుంజయ్ రెడ్డి.. సజ్జల రామకృష్ణారెడ్డి తమను జగన్ ను కలవకుండా అడ్డుపడుతున్నారనుకుంటే తమ అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను జిల్లాల పర్యటనలో ఎందుకు తీసుకురాలేకపోయారన్న ప్రశ్నకు కూడా నేతల వద్ద సమాధానం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అసంతృప్తి వల్లనే ఓడిపోయామని మరికొందరు అంటున్నారు. అంటే ఎమ్మెల్యేలు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ కనీసం దీనిపై ఉప్పందలేదా? రైతులు, భూమి యజమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలియలేదా? అసలు ప్రజలతో వారు మమేకం అయి ఉంటే ముందే పసిగట్టేందుకు ఆస్కారం ఉండేది కదా? జగన్ సూచించినట్లు గా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్రమంగా చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేదా? అని ఆలోచించుకోవడం మంచిది. సో.. అప్పుడు జగన్ వల్ల గెలిచామన్నది ఎంత నిజమో.. ఇప్పుడు జగన్ వల్లనే ఓడిపోయామన్నది కూడా అంతే నిజం. కొన్ని నిర్ణయాలు ఈ పరిస్థితికి తీసుకు వచ్చాయని చెప్పకతప్పదు.
Next Story