ఆ డబ్బులు ఎక్కడికెళ్లాయి నడ్డా జీ.. బోలియే: పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి నిలిచిపోయి.. స్కాములే రాజ్యమేలుతున్నాయని, ల్యాండ్, లిక్కర్ స్కామ్‌లు నడుస్తున్నాయని బీజేపీ జాతీయ
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి నిలిచిపోయి.. స్కాములే రాజ్యమేలుతున్నాయని, ల్యాండ్, లిక్కర్ స్కామ్‌లు నడుస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రాజధానికి డబ్బులు ఇస్తే.. వాటిని చంద్రబాబు దోచేశారని మీరే చెప్పారన్నారు. ఇసుక ఉచితం అంటూ రాష్ట్రంలో ఉన్న నదుల్లోని ఇసుకను టీడీపీ, బీజేపీ పెద్దలు భారీగా దోచుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఇద్దరు కలిసి మిద్దెల మిద్దెలు కట్టుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఇసుక మీద వచ్చే రాబడి రూ.4 వేల కోట్లు అని చెప్పారు. మరీ 2014 నుంచి 2019 మధ్య టీడీపీ - బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ రూ.4 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు.
ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయని పేర్ని నాని అన్నారు. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు రేట్లు పెంచామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఇద్దరికే కట్టబెట్టిందన్నారు. లిక్కర్ సిండికేట్‌ను దందాగా నడిపింది మీరు కాదా? అంటూ జేపీ నడ్డాపై పేర్ని నాని ధ్వజమెత్తారు. కర్నూలులో హైకోర్టు పెడతామని గతంలో బీజేపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని గత ప్రభుత్వ హయాంలో ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అమరావతిలో ఎన్నో పాపాలు జరిగాయని, ఆ పాపాలకు కారణం ఎవరని అన్నారు.
సుజనా చౌదరి, సత్యకుమార్, సీఎం రమేష్ మాటలను పట్టించుకుని జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అది వారి ఖర్మ అంటూ దుయ్యబట్టారు. మీపై (నడ్డా) వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తే బాగుంటుందన్నారు. పేదలకు నేరుగా 2.16 లక్షల కోట్లను అందించిన ఘనత సీఎం జగన్‌ది అని అన్నారు. బీజేపీ తను పాలిస్తున్న రాష్ట్రాల్లో తాము ప్రజలకు ఇచ్చిన డబ్బుల్లో సగమైనా ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. కర్ణాటక జనం ఊసిన ప్రభుత్వం మీది కాదా? అని నిలదీశారు. పచ్చ పువ్వులతో నిండిన బీజేపీ కాస్త టీజేపీగా మారిందని జేపీ నడ్డాపై పేర్ని నాని మండిపడ్డారు.