జవాబు చెప్పు బాబూ?
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు నంబర్ వన్ అని సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినందుకు శుభాకాంక్షలు చెబుతావా?
తెలంగాణ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుజాతి కోసం టీడీపీ నిరంతరం శ్రమించిందని గుర్తుచేశారు. తెలుగుజాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని కొనియాడారు. చంద్రబాబు కామెంట్స్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు వేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు నంబర్ వన్ అని సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినందుకు శుభాకాంక్షలు చెబుతావా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు ఏం చేశారు?, నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం మీరు (చంద్రబాబు) ఎందుకు చేయలేదని ఘాటుగా ప్రశ్నలు సంధించారు.
పొట్టి శ్రీరాములు పేరెత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అయితే ఎందుకు వెన్నుపోటు పొడిచావని, ఎన్టీఆర్‌ను పదవి నుంచి ఎందుకు దించేశావు అని.. చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో చంద్రబాబుకు ఏం సంబంధం ఉందో చెప్పాలన్నారు. తాను చెప్పిందే ప్రజలు నిజమని అనుకుంటారన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని పేర్ని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే వరకు హైటెక్‌సిటీకి రోడ్డు ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలోనే హైటెక్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన జరిగిందన్నారు.
వైఎస్ఆర్ హయాంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్, ఓఆర్ఆర్ నిర్మాణం ప్రారంభమైందని ఎమ్మెల్యే పేర్ని నాని గుర్తు చేశారు. గతంలో 2020 నాటికి అద్బుతాలు చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు 2047లో ఏదో చేస్తామంటున్నారని, ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్ముతారని అన్నారు. వారం వారం పోలవరం అన్న చంద్రబాబు.. కేంద్ర దగ్గర ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో వింతలు, విచిత్రాలే జరిగాయన్నారు. 2019లో టీడీపీని ప్రజలు ఎలాగైతే కర్రు కాల్చి వాతపెట్టారో.. మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందన్నారు.