Thu Dec 19 2024 08:52:09 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : పిన్నెల్లి పోలీసుల కన్ను గప్పి ఎలా వెళ్లిపోయారంటే?
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. పోలీసులు కన్నుగప్పి ఆయన పారిపోయారు
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. పోలీసులు కన్నుగప్పి ఆయన పారిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లిందీ తెలియదు. దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఏపీ పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను పట్టుకునేందుకు ఏపీ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు బయలుదేరి వెళ్లాయి. తన అరెస్ట్ తప్పదని భావించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఇద్దరూ కలసి హైదరాబాద్ నుంచి జంప్ అయ్యారని పోలీసులు గమనించారు.
గన్మెన్, డ్రైవర్ లను...
పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెంబడించినా కారులో ఆయన లేరు. గన్మెన్, కారు డ్రైవర్ తో పాటు ఆయన సెల్ఫోన్ లభ్యమవ్వడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో వాళ్లిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేవలం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే పిన్నెల్లి తన ఫోన్ కారులో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడకు వెళ్లాలన్నది మాత్రం పోలీసులకు అంతు చిక్కకుండా ఉంది. తమిళనాడుకు వెళ్లారని కొందరు, కేరళకు వెళ్లి ఉండవచ్చని మరికొందరు చెబుతున్నారు.
ఎక్కడకు వెళ్లాడని?
నిన్న ఉదయం వరకూ హైదరాబాద్ లోనే ఉన్న పిన్నెల్లి పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఆయన ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు తెలిసింది. కొంత విరామమిచ్చిన తర్వాత తానే వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతానని తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించినా ఇంత వరకూ పురోగతి లేకపోవడంతో డీజీపీ నుంచి వత్తిడి కూడా తీవ్రమవ్వడంతో పోలీసు అధికారులు తీవ్రంగానే పిన్నెల్లి కోసం ప్రయత్నిస్తున్నారు.
Next Story