Sun Dec 22 2024 18:08:30 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Sai Reddy : గవర్నర్ పదవి కోసం విజయసాయిరెడ్డి?
వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయి రెడ్డి గవర్నర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గవర్నర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారు. తనకున్న పరిచయాలతో ఢిల్లీ పెద్దలను కలసి తనను గవర్నర్ గా పంపించాలని కోరుతున్నారు. విజయసాయి రెడ్డి ఇటీవల ఒంటరిగా వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం వెనక ఇదే కారణమని అంటున్నారు. అమిత్ షాను మాత్రమే కాకుండా బీజేపీ పెద్దలను కూడా కలసి తన మనసులో మాటను చెబుతున్నట్లుగా పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. విజయసాయిరెడ్డికి ఇంకా రాజ్యసభ పదవీ కాలం ఉండగానే ఆయనకు ఎందుకు గవర్నర్ పదవి అంటూ వైసీపీ నేతల్లోనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అత్యంత సన్నిహితుడిగా...
విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అందుకే ఆయనను రెండుసార్లు రాజ్యసభ పదవికి జగన్ ఎంపిక చేశారు. దీంతో పాటు మొన్నటి ఎన్నికల్లో జగన్ సాయిరెడ్డికి నెల్లూరు పార్లమెంటు టిక్కెట్ ను ఇచ్చారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి వెళ్లడంతో మరో బలమైన నేత లేకపోవడంతో విజయసాయి రెడ్డికి ఇచ్చారని ఆయన ప్రత్యర్థులు అంటున్నప్పటికీ అందులో నిజం మాత్రం లేదన్నది తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వర్గాలు చెబుతున్న మాట. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచి విజయసాయి రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఒక దశలో పార్టీలో నెంబరు 2గా ఆయన పేరు వినిపించేది.
బాధ్యతలను అప్పగించినా...
వైఎస్ జగన్ తొలుత ఉత్తరాంధ్ర బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత సోషల్ మీడియా బాధ్యతలను కూడా విజయసాయిరెడ్డికి ఎన్నికలకు ముందు అప్పగించారు. ఇంత ప్రయారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి ఎన్నికల తర్వాత జగన్ కు దూరం అయినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి జగన్ ను కూడా కలవడం లేదు. అసలు విజయవాడ వచ్చేందుకు కూడా ఆయన ఇష్టపడటంలేదు. ఢిల్లీ, హైదరాబాద్లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కూడా టచ్ లోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విజయసాయిరెడ్డి పార్టీ అధినేతకు దూరమవ్వడానికి కారణాలు మాత్రం తెలియరావడం లేదు.
అదే కారణమా?
వైఎస్ జగన్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ చూసుకునే సాయిరెడ్డిలో ఒక్కసారి ఈ మార్పేమిటి? అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతుంది. అయితే తనకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా అధికారంలో ఉన్ననాళ్లు తనకు ప్రయారిటీ ఇవ్వకపోవడాన్ని కూడా ఆయన మనసులో పెట్టుకున్నారని అంటున్నారు. దీంతోపాటు తనపై ఒక విషయంలో ఒక వర్గం మీడియా ప్రచారం చేసినా దానిని వైసీపీ నేతలు ఎవరూ ఖండించకపోవడాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నట్లు తెలిసింది. అందుకే ఆయన వైసీపీ అధినేతకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. దీంతో పాటు పార్టీ ఓటమి పాలు కావడంతో తాను రాజకీయాలను వదిలేసి గవర్నర్ పోస్టుకు వెళితే కొంత ఉపశమనంగా ఉంటుందని విజయసాయి రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే సాయిరెడ్డి ప్రయత్నాలు సరిపోతాయా? బీజేపీ పెద్దలు అందుకు అంగీకరిస్తారా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది.
Next Story