Sun Nov 24 2024 04:49:53 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : సజ్జలను సైడ్ చేసినట్లేనా? లేకుంటే పార్టీ ఇక అంతేనన్న నిర్ణయానికి జగన్ వచ్చారా?
అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ సైడ్ చేసినట్లే కనపడుతుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ సైడ్ చేసినట్లే కనపడుతుంది. ఆయన స్క్రీన్ మీద కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన వల్ల పార్టీ డ్యామేజీ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లనే తాను రాంగ్ ట్రాక్ లో పడినట్లు జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలతో మాట్లాడటం దగ్గర నుంచి నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించి జగన్ కు చేరవేయడంలో నాడు సజ్జలదే కీలక పాత్ర.
సకల శాఖ మంత్రిగా....
సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రిగా కూడా నాడు విపక్షాలు విమర్శించేవి. మంత్రులుగా ఉన్నా అన్ని శాఖలపై ఆధిపత్యం ఆయనదే ఉండేది. ఒకరకంగా జగన్ కు తలలో నాలుకగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదంటారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా జగన్ దృష్టికి వెళ్లకుండా తానే సర్ది చెబుతూ అంతా తన చేతుల మీదుగానే పాలన జరగాలన్న భావనలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవారంటారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసే కన్నా సజ్జలను కలిస్తే పని అయిపోతుందని నాడు ఐదేళ్లు భావించిన నేతలు చాలా మంది ఉన్నారంటే అది నిజం.
హోంశాఖలో కూడా...
నామినేటెడ్ పోస్టుల భర్తీ దగ్గర నుంచి మంత్రి పదవుల ఎంపిక వరకూ అంతా సజ్జల చెప్పినట్లే నడిచేదంటారు. ప్రధానంగా హోంమంత్రి ఉన్నప్పటికీ నాడు సజ్జల చెబితేనే డీజీపీ కాని, ఉన్నతాధికారులు కానీ స్పందిచేవారంటారు. లేదంటే లేదు. ఇక జగన్ వద్దకు వెళ్లి వచ్చి మీడియాతో విషయాలను పంచుకునేది కూడా సజ్జలే. చివరకు ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కీలక భూమిక పోషించారంటారు. మరోవైపు ఆయన కుమారుడు సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా ఉండటంతో నివేదికలు కూడా ఆయన అనుకున్నట్లుగానే వచ్చేవని చెబుతారు. అలా ఐదేళ్ల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఆటాడుకున్నారు.
టీడీపీ ప్రభుత్వం కూడా...
అలాంటిది పార్టీ దారుణంగా ఓటమి పాలయిన తర్వాత కొందరు వైసీపీ నేతలు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేయడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం కూడా సజ్జల పై నజర్ వేసి ఉంది. అనేక కేసులు తమపై నమోదు కావడానికి ప్రధాన కారణం ఆయనేనని టీడీపీ నేతలు ఇప్పటికీ భావిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి నష్టమే కాకుండా ఇప్పడు కూడా తన వద్దకు సరైన సమాచారం రాదన్న కారణంతో ఆయనను సైడ్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వం మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ బుక్ లో తొలి పేరు ఆయనదే ఉందన్న ప్రచారం మాత్రం జోరుగా అమరావతిలో సాగుతుండటం విశేషం.
Next Story