అపాచీ పరిశ్రమకు భూమి పూజ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఇనగలూరులో లెదర్ యూనిట్‌ను నెలకొల్పేందుకు అపాచీ ముందుకు రాగా
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ బాలాజీ జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి పరిధిలోని ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు భూమి పూజ చేశారు. రూ.800 కోట్లతో ఇనగలూరులో లెదర్ యూనిట్‌ను నెలకొల్పేందుకు అపాచీ ముందుకు రాగా.. తొలి దశలో రూ.400 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లను పెట్టుబడిగా పెట్టబోతోంది. ఈ యూనిట్లో ఆడిదాస్ షూస్, లెదర్ జాకెట్లు, లెదర్ బెల్టులను అపాచీ తయారు చేయనుంది. ఈ యూనిట్‌కు భూమి పూజ చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. అపాచీ పరిశ్రమతో కొత్తగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఈ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే దక్కనున్నాయని ఆయన తెలిపారు. 2023 నాటికి ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు. రానున్న రెండేళ్లలో ఉత్పత్తికి ఇనగలూరు అపాచీ యూనిట్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా(అపాచీ గ్రూప్)కి భూ కేటాయింపుల పత్రాన్ని ఆ సంస్థ సీఈవో టోనీకి ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం అందించారు. ఎకరాకి రూ. 6,50,000 చొప్పున 298 ఎకరాల అన్ డెవలప్డ్ ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ అలాట్ మెంట్ లెటర్ అందజేశారు. స్థానికులకే 80 శాతం ఉద్యోగాలతో ఈ యూనిట్ ద్వారా 10వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇక తిరుపతిలో టీసీఎల్ గ్రూప్‌నకు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్ లిమిటెడ్, డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో టెక్ తదితర కంపెనీలకు భూమి పూజ చేశారు.