Thu Dec 19 2024 23:39:58 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఆ పెద్దాయన ఎన్నికలు ముందు టెంకాయ కొట్టి పోయాడంతే
వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని ఎన్నికలకు ముందు ప్రారంభించిన నేత చంద్రబాబు అని జగన్ అన్నారు.
వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని ఎన్నికలకు ముందు ప్రారంభించిన నేత చంద్రబాబు అని జగన్ అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపనలు చేసి మోసం చేశారన్నారు. ప్రాజెక్టు ప్రారంభమవుతుందని రైతులను మోసం చేసింది చంద్రబాబు అని జగన్ అన్నారు. మాచర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6వ తేదీన అటవీ శాఖ నుంచి వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం 1,600 కోట్ల రూపాయలు అని ఆయన అన్నారు. నాలుగు దశలుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్నికలకు ముందు పెద్దాయన టెంకాయ కొట్టాడని జగన్ ప్రశ్నించారు.
చెప్తే నిజాయితీ ఉండాలి...
చేసేపనికి చిత్తశుద్ధి ఉండాలని, మాట ఇస్తే నిజాయితీ ఉండాలని అన్నారు. మోసంతోనే చంద్రబాబు అడుగులు కొనసాగాయని జగన్ అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. కేవలం 23 స్థానాలు ఇచ్చి మోసాలకు తాము అండగా నిలవమని చెప్పారన్నారు. ప్రస్తుతం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. సాగర్ కు నలభై కిలోమీటర్ల ఎగువన జరుగుతున్న ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగునీరు అందుతుందని తెలిపారు. 340 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతానికి నీటిని తెచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఎంత అవసరమో తనకు తెలుసునని, దశల వారీగా, మాచర్ల, వినుకొండ, యర్రగొండపాలెం ప్రాంతాలకు నీటిని అందిస్తామని తెలిపారు.
కష్టకాలంలోనూ...
యాభై మూడు నెలల్లో సంక్షేమ పథకాలను అందరికీ అందించామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ సమస్య వచ్చి ఆదాయం తగ్గినా సంక్షేమాన్ని ఆపలేదన్నారు. కష్టకాలంలోనూ ఎవరినీ మరింత ఇబ్బందిపెట్టకూడదని సంక్షేమాన్ని కొనసాగించామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవాలని కోరారు. ప్రతిపక్ష నేతకు పేదలకు మేలు చేద్దామన్న ఆలోచన లేదన్నారు. కనీసం ఒక్క పథకాన్ని అయినా అమలు చేసిన చరిత్ర ఉందా? అని జగన్ ప్రశ్నించారు. మంచి జరిగి ఉంటేనే తోడుగా ఉండాలని కోరారు. పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు ఏం చేశారో గ్రహించాలన్నారు. ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వాని తేడా గమనించాలని కోరుతున్నానని తెలిపారు.
విజన్ పేరిట...
చంద్రబాబు ఎప్పుడూ విజన్ అంటూ మోసం చేస్తారన్నారు. 2023 లో ఉంటే 2047 గురించి చెబుతారని అన్నారు. ఇప్పుడు గురించి ఆలోచించరని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జనం సమస్యలు ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. పల్నాడుకు జిల్లా ఇచ్చింది ఎవరు అంటే వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ఆరోగ్య పరిరక్షణకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. యాభై మూడు నెలల్లోనే ఇంత అభివృద్ధి పనులను చేశామని జగన్ అన్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వారు జనాలను వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? అని నిలదీశారు.
Next Story