Mon Dec 23 2024 02:27:35 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జిత్తుల మారి చంద్రబాబు కుట్రలను తిప్పి కొట్టండి
చంద్రబాబు చెప్పింది ఎప్పుడూ చేయరని, మోసాలతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారని వైఎస్ జగన్ అన్నారు.
చంద్రబాబు చెప్పింది ఎప్పుడూ చేయరని, అంతా మోసాలతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారని వైఎస్ జగన్ అన్నారు. ఆయన గురజాల నియోజకవర్గంలో జరిగిన మేమంతా సిద్ధం సభలో ప్రసంగించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు గంగా.. తర్వాత చంద్రముఖి అంటూ ఎద్దేవా చేశారు. 2014లో కూడా ఇలాగే చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కేవలం 32 వేల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావని, పేదలకు, పెత్తందార్లకు, మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు.
అధికారంలోకి రాగానే...
జిత్తుల మారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే గ్రామ స్థాయి నుంచి ఎన్ని మార్పులు తెచ్చామో చూడాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎవరికైనా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. జాబు రావాలంటే ఎవరు రావాలని ఆయన ప్రశ్నించారు. జాబు రావాలంటే.. ఫ్యాన్ రావాలని, తుప్పు పట్టిన సైకిల్ పోవాలని అన్నారు. రైతులకు ఏం చేశాడో కూడా చంద్రబాబు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.రైతుకు ఆయన ఏం చేశాడో చెప్పలేడు కానీ, ఆయన రైతులకు చేసిన అన్యాయాన్ని తాను చెబుతానని అన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేయలేదా? అని నిలదీశారు.
ప్రతి గ్రామంలో...
ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. లక్షన్నర మంది ఉద్యోగులను నియమించామని తెలిపారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న చంద్రబాబు విడిపించాడా? అని ప్రశ్నించారు. మ్యానిఫేస్టోలో పెట్టిన ఏ ఒక్కహామీని కూడా నెరవేర్చకుండా చివరకు దానిని వెబ్సైట్ నుంచి కూడా మాయం చేశారన్నారు. విద్య, వైద్య రంగంలో సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. విద్యను, వైద్యాన్ని పేద ప్రజలకు అందేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యవసాయానికి పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించడం నిజంకాదా? అని జగన్ ప్రశ్నించారు. బడుగులను ఆదుకునే ప్రభుత్వం ఇది అని జగన్ అన్నారు.
Next Story