Tue Dec 24 2024 13:53:37 GMT+0000 (Coordinated Universal Time)
ఆయన అండదండలు మరువలేనివి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు నెలకొనేలా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యవహరించారని సీఎం జగన్ అన్నారు
రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు నెలకొనేలా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యవహరించారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గవర్నర్ వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదిగా ఉన్న హరిచందన్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించారని జగన్ కొనియాడారు. ఆయన గవర్నర్ కాకముందు మంచి ప్రజా ప్రతినిధిగా కొనసాగారన్నారు. ప్రత్యర్థిపై 95 వేల ఓట్లతో గెలిచారంటే ఆయన ప్రజల మనసులను గెలుచుకున్నారని జగన్ అన్నారు. ఆయనకు చేదోడు వాదోడుగా గవర్నర్ సతీమణి నిలిచారన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని జగన్ ఆకాంక్షించారు. ఆయన ప్రజలకు మరింత సేవలిందించాలని కోరారు. గవర్నర్, ముఖ్యమంత్రి సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా...
గవర్నర్ కాకముందు ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. గవర్నర్ తో తనకు అనుకున్న జ్ఞాపకాలను మరువలేనని జగన్ అన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చిందన్నారు. పేదలకు అండగా ఈ ప్రభుత్వం నిలిచిందనడంలో అతిశయోక్తి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ చూపిన గౌరవం, ఆత్మీయత మరువలేని వని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను తాను స్వయంగా సందర్శించి అక్కడ అందుతున్న సేవలను చూశానని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ బిశ్వభూషణ్ హరిచందన్ ను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందచేశారు.
Next Story