Thu Nov 28 2024 01:32:29 GMT+0000 (Coordinated Universal Time)
జరగబోయేది క్లాస్ వార్ : జగన్
జరగబోయే కురుక్షేత్రం క్లాస్ వార్ అని జగన్ అన్నారు. ఎమ్మిగనూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
జరగబోయే కురుక్షేత్రం క్లాస్ వార్ అని జగన్ అన్నారు. ఎమ్మిగనూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తనకు ఎవరి అండలేదన్నారు. తోడేళ్లన్నీ ఏకమయి మీ ముందుకు వస్తారన్నారు. గతంలో చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో ప్రజలను కూడా మోసం చేశారని జగన్ అన్నారు. అక్కడ పేదవాడికి ఇంటి స్థలం కూడా ఇవ్వలేదన్నారు. రాజధాని భూముల అవినీతి నుంచి స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ వరకూ, ఫైబర్ నెట్ కుంభకోణం నుంచి మద్యం కొనుగోలు వరకూ అంతా అవినీతే అని ఆయన అన్నారు. చంద్రబాబు ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. కానీ ఈ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అందులో ఇప్పటికే 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారన్నారు.
హామీలను నాలుగేళ్లలో...
ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో అమలు చేసిన ఘనత మన ప్రభుత్వానిదేనని జగన్ అన్నారు. జగనన్న చేదోడు కార్యక్రమం కింద నిధులను లబ్దిదారులకు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా పదిహేను లక్షల మంది చిరు వ్యాపారులకు అందచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 2,906 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి నాలుగేళ్లలో వేశామని చెప్పారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగాయా? అని జగన్ ప్రశ్నించారు. ప్రతి పేదవాడి కుటుంబానికి తోడుగా ఉండే అడుగులు పడింది ఈ ప్రభుత్వ హయాంలో కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏ పేద కుటుంబమైనా ఏం కోరుకుంటుందని? కేవలం వైద్యం, విద్య మాత్రమేనని అన్నారు. ప్రభుత్వమే తమ ఇంటికి వచ్చి అన్నీ ఇవ్వడాన్ని ఎప్పుడైనా చూశారా? అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
లంచాలు లేకుండా...
ఒక ప్రభుత్వం ఇలా వచ్చి లంచాలు లేకుండా పార్టీలకు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతాయని ఎవరైనా ఊహించారా? అని అడిగారు. 52 నెలల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అమలు జరిగాయన్నారు. గతంలోనూ అదే బడ్జెట్ అని, అదే రాష్ట్రమని కానీ ముఖ్యమంత్రి మారాడని, కానీ అప్పుడు ఎందుకు ఈ పథకాలు రాలేదని ఆయన ప్రశ్నించారు. గతానికి, ఇప్పటికి తేడా ఏమిటో ఆలోచన చేయమని కోరారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుతిందని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుంటే ఇప్పుడు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం మంచి విద్యను అందించి తమ పిల్లలకు అందించాలని కోరుకుంటుందని ఆయన అన్నారు. పేదలకు అండగా నిలచే ప్రభుత్వం కావాలని కోరుకుంటుందన్నారు.
Next Story