Mon Nov 25 2024 21:59:46 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ప్రశాంత్ కిషోర్ నీ దేముంది భయ్యా.. అంతా ఈ టీందే.. నీకు షాక్ ఇవ్వబోతున్నాను చూసుకో
ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తాయని జగన్ అన్నారు.
2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో 151 స్థానాలు సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదంతా ఆయన గొప్పతనం కాదని జగన్ ఐదేళ్ల తర్వాత తేల్చేశారు. కేవలం టీం గొప్పతనం మాత్రమేనని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ కు, వైఎస్ జగన్ కు మధ్య అంతరం ఏర్పడింది. ఇద్దరూ విడిపోయారు. ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. జగన్ ఈసారి గెలవరని కూడా అనేక టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు.
చంద్రబాబును కలవడం...
ప్రశాంత్ కిషోర్ కేవలం విమర్శలు చేయడమే కాకుండా ఉండవల్లి వచ్చి చంద్రబాబును కలవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రశాంత్ కిషోర్ ను 2019 ఎన్నికల సమయంలో పార్టీ ప్లీనరీలో పరిచయం చేసిన జగన్ ఆ తర్వాత పలుమార్లు పీకే ను ఈసారి కూడా తనకు వ్యూహకర్తగా వ్యవహరించాలని కోరారంటారు. అయితే తాను బీహార్ రాజకీయాల్లో ఉన్నందున సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఎప్పుడూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. కానీ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై జగన్ తొలిసారి స్పందించారు. దేశంతో పాటు ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చే రిజల్ట్ చూసి షాకవుతారన్నారు.
ఏమన్నారంటే...
ఐప్యాక్ టీంతో సమావేశం అయిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తాయని జగన్ అన్నారు. గొప్పతనమంతా ఐప్యాక్ టీందేనని ప్రశాంత్ కిషోర్ ది కాదని జగన్ అన్నారు. జగన్ కు ఓటమి తప్పదంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ మనకు అడ్డం తిరిగినా విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. 2019 ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ తనకు 151 స్థానాలు వస్తాయని చెప్పలేకపోయారని, ఆయన గొప్పతనం ఏమీ ఇందులో లేదని, కేవలం టీంది మాత్రమేనని జగన్ అన్నారు. ఎంపీ సీట్లు కూడా గతంలో కంటే ఎక్కువ సాధించబోతున్నామని, అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందిస్తామని ఆయన పూర్తి విశ్వాసంతో చెప్పారు
Next Story