Tue Nov 05 2024 06:39:18 GMT+0000 (Coordinated Universal Time)
Laddu Controversy : జగన్ లడ్డూ వివాదంపై సంచలన నిర్ణయం.. తిరుమలకు రానిస్తారా?
తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని నిర్ణయించారు
తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ నెల 28వ తేదీన జగన్ తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే జగన్ తిరుమలకు కాలినాడకన వెళ్లి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకోనున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే అదే సమయంలో జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకోవాలంటే జగన్ తాను వెంకటేశ్వరస్వామి భక్తుడేనంటూ డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని వారు కోరుతున్నారు.
ఈ నెల 28వ తేదీన...
ఈ నెల 28వ తేదీన అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపు నిచ్చారు. ఎక్స్ లో ఆయన పిలుపునిస్తూ రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు తిరుమల లడ్డూ నాణ్యత విషయంలో అబద్ధాలు ఆడుతున్నారని జగన్ అన్నారు. కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేసి మహా అపచారానికి పాల్పడ్డారని జగన్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతలంతా ఈ నెల 28వ తేదీన ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని జగన్ పిలుపు నివ్వడంతో మరోసారి వివాదం రాజుకుంది. పార్టీ నేతలతో సమావేశమైన జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో లడ్డూ లడాయి మరోసారి రచ్చ కెక్కే అవకాశాలున్నాయని తెలిసింది.
టీడీపీ వదిలేసినా...?
ఈ విషయాన్ని ఇప్పుడు టీడీపీ వదిలిపెట్టినా జగన్ మాత్రం వదలిపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు చేసిన దుష్ప్రచారం కారణంగా కోట్లాది మంది హిందూభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే అందరూ పూజల్లో పాల్గొని వచ్చే శనివారం రోజున ప్రతి ఒక్క వైసీపీ నేత పూజల్లో పాల్గొనాలని జగన్ పిలుపు నివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. అయితే జగన్ ను తిరుమలకు అనుమతిస్తారా? లేక ఆయనను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా?అన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో ఈ నెల 1వ తేదీన పవన్ కల్యాణ్ కూడా ప్రాయశ్చిత్త దీక్షను విరమించడానికి తిరుమల వెళుతున్నారు. సో.. మరోసారి మళ్లీ తిరుమల ఆలయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారనుంది.
Next Story