Mon Dec 23 2024 11:19:04 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan And Ys Sharmila : వైఎస్ ఆస్తుల వివాదంలో ఈ పెద్దోళ్లున్నారే?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆస్తుల వివాదంలో రోడ్డు కెక్కింది
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆస్తుల వివాదంలో రోడ్డు కెక్కింది. ఇంటా, బయటా ఆ వివాదం ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో ప్రజల నోళ్లలో నానుతుంది. వారిని వీరు విమర్శించుకోవడం, వీరిపై వారు బురద చల్లుకోవడం కామన్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ అభిమానుల్లో కొంత అసహనం, ఇబ్బంది కలుగుతున్నాయి. వైఎస్ కుటుంబం కూడా చీలిపోయినట్లే కనిపిస్తుంది. వైఎస్ షర్మిల, విజయమ్మ ఒకవైపు మిగిలిన కుటుంబం మరొక వైపు ఉన్నట్లు కనపడుతుంది. జగన్ కు అనుకూలంగా ఇప్పటికే బాబాయి వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. కానీ అటు వైపు షర్మిల ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు.
రాజీ చేయగల సామర్థ్యం...
అయితే ఈ పరిస్థితుల్లో ఇద్దరు నోరు విప్పాలంటూ వైఎస్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇద్దరి మధ్య రాజీ కూడా చేయగల శక్తి, సామర్థ్యం వారిద్దరికి మాత్రమే ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ గత కొద్ది రోజులుగా ఆస్తుల వివాదం రచ్చ కెక్కుతున్నా వారు మాత్రం పెదవి విప్పడం లేదు. వారిద్దరూ వైఎస్ ఆత్మ ఒకరు. మరొకరు రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు మరొకరు. వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు, వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్లు ఈ వివాదంలో తలదూర్చలేదు. కుటుంబ గొడవలని దూరంగా ఉన్నారా? లేక ఆస్తుల గొడవ మనకెందుకులేనన్న ధోరణితో ఉన్నారో కానీ వారిద్దరూ మాట్లాడటం లేదు.
ఆత్మగా చెప్పుకునే...
వైఎస్ ఆత్మబంధువుగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావుకు ఆయన ఆస్తుల విషయం కూడా పూసగుచ్చినట్లు తెలుసు. వైఎస్ కుటుంబంలో జరిగే అణువణువూ ఆయనకు తెలిసి జరిగిందే. చదువుకున్న నాటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావులు ఇద్దరూ స్నేహితులు కావడంతో ఒకరి విషయాలు మరొకరు పంచుకునే వారు. వివాహాలు అయిన తర్వాత కూడా ఆ స్నేహబంధం ఎంతగా కొనసాగిందో.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే తరహా పరిస్థితి ఉందన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. వైఎస్ మరణం తర్వాత కేవీపీ ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకంలో వైఎస్ వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించారు. ఆయన బలాబలహీనతలు ఆయనకు క్షుణ్ణంగా తెలుసు.
ఇద్దరూ మౌనంగానే...
అలాంటి కేవీవీ రామచంద్రరావు ఇప్పుడు మౌనంగా ఉండటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన బయటకు వచ్చి వైఎస్ నాడు ఏమనుకునేవారో చెప్పగలగాలి. మరొకరు ఉండవల్లి అరుణ్ కుమార్. న్యాయవాది వృత్తిలో ఉన్నా రాజకీయాల్లో వైఎస్ కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ గురించి పూర్తిగా అవగాహన ఉంది. అలాగే వైఎస్ జగన్, షర్మిల కూడా ఆయనను కలసి గతంలో చర్చించారు. అలాంటి సమయంలో ఉండవల్లి లీగల్ బుర్ర అయినా కాస్త పదును పెట్టి ఈ గోల సర్దుబాటు చేసే ప్రయత్నంచేయాల్సి ఉంటుంది. కానీ జగన్ వ్యక్తిగతం తెలుసు. షర్మిల మనస్తత్వం తెలుసు. అందుకే పెద్దరికం వహించి రచ్చ మరింత ముదరకముందే నోరు విప్పాలన్న డిమాండ్ వైఎస్ అభిమానుల నుంచి వినిపిస్తుంది. అప్పుడే ఆస్తుల వివాదానికి కొంత వరకూ కామా పడుతుంది. లేదంటే ఇది నడుస్తూనే ఉంటుంది. లేదు..లేదు.. నడుపుతూనే ఉంటారు.
Next Story