Sun Nov 24 2024 09:06:13 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : ఓటమి పాలయినా వదలని చెల్లెమ్మ... వెంటపడుతూనే ఉన్నారుగా?
వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో సుదీర్ఘ పోరాటం చేశారు.
వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ఎన్నో విషయాలు ఆమె ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు చేసిన అవినీతి, అరాచకాలు ఇవేనంటూ బయటపెట్టారు. ఇలా జగన్ పంటి కింద రాయిలా వైెఎస్ షర్మిల మారారు. కానీ అన్ని చోట్ల పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా గెలవలేదు. కనీసం కడప పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఆమె స్వయంగా పోటీ చేసినా గెలుపు సాధించలేకపోయారు.
ఓటమి చవి చూసినా...
అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జగన్ దారుణ ఓటమిని చూశారు. కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వచ్చిన వారిని వచ్చినట్లు పార్టీలో చేర్చుకున్నారు. అంతా చేసినా ఆమె సాధించింది లేదు. జగన్ ను మాత్రం దారుణంగా రాజకీయంగా దెబ్బతీయగలిగారు. కానీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల గురించి చంద్రబాబు కోవర్టుగా వచ్చారని విమర్శలు చేయడం మినహా జగన్ అంతకు మించి ఏమీ విమర్శలు చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ షర్మిలను రాజకీయంగా విమర్శలు చేసిన జగన్ ఫలితాల తర్వాత ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించడం మానేశారు. అంటే వైఎస్ షర్మిలను తాను నేతగా కూడా గుర్తించలేదని అర్ధమవుతుంది.
ఎన్నికల ఫలితాల తర్వాత...
కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ షర్మిల జగన్ ను వదలి పెట్టడం లేదు. వెంటపడుతూనే ఉన్నారు. వైఎస్ అభిమానులకు ఇది కొంత ఆందోళన కల్గిస్తుంది. జగన్ ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళుతుంటే దానిపై కూడా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. జగన్ ఐదేళ్ల పాటుహత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెళ్లకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. వివేకా హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. వినుకొండ హత్య వ్యక్తిగత హత్యేనని.. రాజకీయమైంది కాదంటూ జగన్ ను వదలకుండా వెంట పడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Next Story