Sun Dec 22 2024 16:18:42 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి ఏపీలో కాంగ్రెస్ ఆందోళన
విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన కూటమి సర్కార్ మోపుతోందని వైఎస్ షర్మిల అన్నారు.
విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి, ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోందని వైఎస్ షర్మిల అన్నారు. 18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో తమ తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారని ఆరోపించారు. సర్దుబాటు కాదు ఇది అపి.. ప్రజలకు "సర్దుపోటు". కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అంటూ వైఎస్ షర్మిల కూటమి సర్కార్ పై విమర్శలు చేశారు. విద్యుత్ ఛార్జీల విషయంలో వైసీపీ చేసింది పాపం అయితే, రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం" అంటూ ధ్వజమెత్తారు.
విద్యుత్తు ఛార్జీలను పెంచుతూ...
గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం ?ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా ? అని ఆమె ప్రశ్నించారు. 5 ఏళ్లలో వైసీపీ మోపిన భారం రూ.35వేల కోట్లు అయితే 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? అంటూ నిలదీశారు. వైసీపీకి మీకు ఏంటి తేడా ? అని ప్రశ్నించారు. వైసీపీ 9సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్న విషయాన్ని మర్చిపోయి సర్దుబాటు ఛార్జీలను జనం నెత్తిన పడేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని వైఎస్ షర్మిల హెచ్చరించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమని వైఎస్ షర్మిల ప్రకటించారు.
Next Story