Thu Dec 26 2024 01:06:32 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : అంతటా రాంగ్ స్టెప్లేనా? ఫ్యూచర్ అసలు కనుచూపు మేరలో కనపడుతుందా?
వైఎస్ షర్మిల రాజకీయంగా తొలి నుంచి వేస్తున్న అడుగులు కరెక్ట్ గా పడటం లేదు
వైఎస్ షర్మిల రాజన్న బిడ్డగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే షర్మిల మాత్రం రాజకీయంగా తొలి నుంచి వేస్తున్న అడుగులు కరెక్ట్ గా పడటం లేదు. అసలు తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారో ఆమెకే తెలియాలి. అసలు బేస్ లేని చోట వైఎస్సార్ పేరు చెప్పుకుని కొన్ని సీట్లు అయినా సంపాదించుకుని రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. పాదయాత్ర చేస్తే తనకు కొంత సానుకూలత వస్తుందని భావించి తెలంగాణలో నాడు పాదయాత్ర కూడా చేశారు. అయితే వైెఎస్ అంటే అభిమానం ఉన్న నేతలు కూడా ఆమె వైపు చూడలేదు. ఎవరో ఒకరోఇద్దరో చేరి వైఎస్సార్టీపీ నేతలని చెప్పుకున్నారు తప్పించి వారికి ప్రజాక్షేత్రంలో బలం లేని వాళ్లు మాత్రమే.
పార్టీని క్లోజ్ చేసి...
అదే సమయంలో పాలేరు నుంచి పోటీ చేయాలని ఆమె భావించారు. పాలేరు అయితే తన గెలుపు సులువని ఆమె లెక్కలు వేసుకుని అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే దానికి ఆమె ఇచ్చిన వివరణ కూడా ఆమె పక్కనున్న నేతలు కూడా విశ్వసించలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం తాను పోటీ నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించిన వైెఎస్ షర్మిల అప్పటి వరకూ ఆమె వెంట ఉన్న నేతలకు చెప్పకుండా నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కలసి తాను పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రకటించారు. దీంతో ఉన్న నేతలు కూడా పార్టీ నుంచి వెళ్లిపోయారు.
ఏపీ రాజకీయాల్లోకి...
ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అనూహ్యంగా కాలు మోపారు. అప్పటి వరకూ తెలంగాణ బిడ్డనంటూ డైలాగులు కొట్టిన వైఎస్ షర్మిల చివరకు ఏపీికి వచ్చి తాను ఇక్కడ బిడ్డనేనంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సరైన నాయకత్వం లేక పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించింది. 2014లో కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా పతనమయింది. 2014 నుంచి మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభలోకి అడుగుపెట్టలేదు. అంటే ఇంత వరకూ గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించలేదు. కాంగ్రెస్ తో జత కట్టిన కమ్యునిస్టులు కూడా ఒక్క సీటును సాధించలేక చతికలపడ్డారు. అలా కాంగ్రెస్ తో దోస్తీ అంటేనే మిగిలిన పక్షాలు భయపడే పరిస్థిితి ఏర్పడింది.
కేంద్రంలోనూ కాంగ్రెస్ ....
ిఇక 2029 ఎన్నికల వరకూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ కాంగ్రెస్ కోలుకుంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ తప్ప మరొక పార్టీకి అవకాశం లేదు. ఇతర పార్టీలు ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల సాధించేదేముంటుందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి అయినా వచ్చే అవకాశముంది. అదీ కూడా లేదు. 2029 వరకూ వెయిట్ చేయాల్సిందే. అందుకే వైఎస్ షర్మిల రాజకీయంగా వేసిన అడుగులన్నీ వృధాయేనన్నది వాస్తవం. ఎంతగా ప్రజల్లోకి వెళ్లాలనుకున్నా సమస్యలపై పోరాటాలు చేసినా ఏపీలో కాంగ్రెస్ కు ఇప్పట్లో కాలం కలసి రాదన్నది వాస్తవం. మరి షర్మిల ప్రయత్నాలు ఎందుకో మరి?
Next Story