Fri Nov 22 2024 17:09:35 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sunitha : టాస్క్ ముగిసినట్లేనా? ఇక అంతా క్లోజ్ అయిపోయినట్లేనా?
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారు
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారు. జగన్ ఓటమికి తాను కూడా కొంత కారణమయ్యారని చెప్పకతప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఆమె గత నాలుగేళ్లు పెద్ద యుద్ధమే చేశారు. న్యాయపరంగా హత్య కేసుపై పోరాటం చేశారు. హత్య కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. అలాగే నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని పెద్దయెత్తున పోరాటం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజూ మీడియా సమావేశాలతో హోరెత్తించేవారు.
వైఎస్ షర్మిలతో కలసి...
ఇక ఎన్నికల సమయంలో కడప జిల్లాలో తన సోదరి వైఎస్ షర్మిలతో కలసి విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ ను పులివెందులలో ఓడించాలని, ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గద్దించారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ఓడించి వైఎస్ వివేకా ఆత్మకు శాంతి చేకూర్చాలని పదే పదే గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు పిలుపు నిచ్చారు. అయితే అందులో ఒకటి సాధ్యమంది. తన సోదరుడు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఒక పాత్రనయితే పోషించగలిగారు. ఇక పులివెందులలో జగన్ ను ఓడించడంలో, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని పరాజయం పాలు చేయడంలో మాత్రం ఆమె సక్సెస్ కాలేకపోయారు.
వైసీపీకి మూడు స్థానాలే...
కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి కేవలం మూడు శాసనసభ స్థానాలు వచ్చాయంటే ఖచ్చితంగా వైఎస్ సునీత ప్రభావం కొంత చూపించిందని అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 2019 మార్చి 14వ తేదీన ఆయన పులివెందులలోని ఆయన సొంత గృహంలో దారుణ హత్యకు గురయినప్పటికీ ఇంత వరకూ ఆయన హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అలాగే హంతకులు ఎవరు? ఎవరు హత్యచేయించారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. దాదాపు ఆరేళ్లు గడుస్తున్నా అంతూ పొంతూ లేకుండా కేసు నడుస్తుంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను కాదని వైఎస్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణకు ఆదేశించేలా శ్రమించారు.
ప్రభుత్వం మారినా...
కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. తాను ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి కడప ఎంపీగా విజయం సాధించారు. కేంద్రంలో మాత్రం ప్రభుత్వం మారలేదు. అయితే వైఎస్ సునీత వాయిస్ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న తన టాస్క్ ముగిసిపోయినట్లు ఆమె వ్యవహరిస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన సోదరుడి ప్రభుత్వం చేసిన పోరాటం ఇప్పుడు ఏమయిందని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే కావడంతో కొన్ని రోజులు ఆగాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం సిస్టర్ సునీత వాయిస్ వినిపించకపోవడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గానే మారింది.
Next Story