Fri Nov 22 2024 07:42:26 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పార్టీ అవసరం లేదా జగన్? ఇంకా టైం ఉందని వెయిటింగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తరచూ బెంగళూరుకు వెళుతూ పార్టీ నేతలకు అసహనం రేపుతున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తరచూ బెంగళూరుకు వెళుతూ పార్టీ నేతలకు అసహనం రేపుతున్నారు. జగన్ ఎప్పుడు అందుబాటులో ఉండకుండా బెంగళూరులో ఉండటం వల్ల ఇక్కడ క్యాడర్ నుంచి లీడర్ల వరకూ ఎలా ధైర్యంగా ఉంటారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ పది సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఎవరైనా చనిపోయినా, లేకపోయినా వరదల వంటి ఆకస్మిక ఘటనలు జరిగితే విజయవాడకు వస్తున్నారు తప్పించి ఇక్కడే ఉండి రాజకీయం చేయడానికి జగన్కు మనసొప్పడం లేదంటున్నారు. ఆయన ఎక్కువ సమయం బెంగళూరులోని తన ప్యాలెస్ లోనే గడుపుతుండటం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాదు సొంత పార్టీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
క్యాడర్ లో నైరాశ్యం...
వైఎస్ జగన్ ఓటమి నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. తన పార్టీ ఎందుకు దారుణ ఓటమి పాలయిందో తెలుసుకోలేకపోతున్నారు. ఏ పార్టీకైనా క్యాడర్ పటిష్టంగా ఉంటేనే నేతలు ముందుకు వస్తారు. కానీ క్యాడర్ లోనే నైరాశ్యం అలుముకుంటే అది తిరిగి సాధించాలంటే చాలా కష్టతరమైన విషయం. 2014 నుంచి 2019 వరకూ వైసీపీకి పటిష్టమైన క్యాడర్ ఉండేది. ఎలాంటి క్యాడర్ అంటే జగన్ మీద ఈగ వాలితే చాలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసేంతగా. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరులో పూర్తిగా మార్పు వచ్చింది. అసలు వైసీపీ క్యాడర్ తనకు అవసరం లేదని, తన ఫొటోయే తనను మళ్లీ అందలం ఎక్కిస్తుందని భ్రమలో పడ్డారు.
2024 ఎన్నికల్లో...
దాని ఫలితాన్ని 2024 ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో చూశారు. పల్నాడు, రాయలసీమ వంటి బలమున్న ప్రాంతాల్లో కూడా పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ క్యాడర్ పత్తా లేరు. దీనికి కారణం జగన్ చేసుకున్న నిర్వాకమే. అది కొందరి నేతలు ఓటమి తర్వాత బాహాటంగా అంగీకరించారు. ఈ విషయాన్ని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి నేతలు బహిరంగంగానే చెప్పారు. 2029 ఎన్నికల్లో మళ్లీ పార్టీ అధికారంలోకి రావాలంటే బలమైన క్యాడర్ నియోజకవర్గాల్లో అవసరం. 2014 నాటి సీన్ ను జగన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేయకుండా వైఎస్ జగన్ బెంగళూరులోనే మకాం వేస్తే ప్రయోజనం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్య క్యాడర్ కూడా వెళితే?
మరోవైపు కీలక నేతలు వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారు. దగ్గర వాళ్లు కూడా దూరమవుతున్నారు. ఎవరినీ సముదాయించాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చినట్లుంది. వెళ్లే వాళ్లకు గుడ్ బై చెప్పడం మినహా వారిని బతిమాలి.. బుజ్జగించి ఉంచుకోవాల్సిన అవసరం ఏంటన్న అభిప్రాయంలో వైఎస్ జగన్ ఉన్నట్లు కనపడుతుంది. అయితే అదే సమయంలో నియోజకవర్గంలో ముఖ్య నేతలు కూడా పార్టీని వదలిపెట్టి వెళ్లి పోతున్నారు. నేతలంటే వచ్చే ఎన్నికల నాటికి ఎవరికో ఒకరికి టిక్కెట్లు ఇచ్చే అవకాశముంటుంది. కానీ ముఖ్యమైన నేతలు జారిపోతే అలాంటి వారు తయారు చేసుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాదు సమయం కూడా తీసుకుంటుంది.
అక్కడే ఉంటే?
రేపు పోలింగ్ కేంద్రాల వద్ద ఉండాల్సిన క్యాడర్ బలహీనపడిపోతే పార్టీని ఆ దేవుడే రక్షించాలి తప్ప ఎవరూ కాపాడలేరన్న టాక్ బలంగా ఫ్యాన్ పార్టీలో నడుస్తుంది. బెంగళూరులో ఏముందని అక్కడకు వెళ్లి కూర్చోకపోతే..తాడేపల్లిలో క్యాడర్ కు అందుబాటులో ఉండి ప్రతి రోజూ నేతలతో సమావేశమవ్వడం, లేదా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టడం వల్ల కొంత ధైర్యాన్ని ఇచ్చినట్లవుతుంది. ఇప్పటికే అధికార పార్టీ దూకుడుకు వైసీపీ నేతలు, క్యాడర్ తట్టుకోలేకపోతున్నారు. వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఆర్థికంగా ఇప్పటికే నష్టపోయి ఉన్నారు. ప్రధాన సామాజికవర్గాలు కూడా దూరమయ్యాయి. బెంగళూరును వదలకపోతే జగన్ కు రానున్న కాలంలో కష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్న కామెంట్స్ మాత్రం ఆ పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియా కూడా బలహీనం కావడంతో వాయిస్ లేకుండా పోయింది.
Next Story