Thu Nov 21 2024 21:33:26 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ లీడర్లు బౌన్స్ బ్యాక్ అవుతున్నారా? చంద్రబాబే కారణమా?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. అనేక మందిలీడర్లు మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల కాలంలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. అయితే దాదాపు మూడు నెలల నుంచి వైసీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. మీడియా సమావేశంలో అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్ రెడ్డి వంటి వారు మాత్రమే స్పందిస్తున్నారు తప్పించి మిగిలిన వారు మౌనంగానే ఉంటున్నారు. మరో వైపు అనేక మంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు. అందరూ నేతలు ముందస్తు బెయిల్ తెచ్చుకుని కొంత ఊరట పొందారు. కానీ తిరుమల లడ్డూ వివాదం తర్వాత వైసీపీ నేతలు అందరూ యాక్టివ్ అవుతున్నట్లే కనపడుతుంది.
సాగదీయడంతోనే...
లడ్డూ వివాదాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు అనవసరంగా సాగదీయడంతో వైసీపీకి పెద్దయెత్తున డ్యామేజీ అవుతుందని భావించిన వైసీపీ నేతలు తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకపోతే మరికొంత కాలం వైసీపీ నేతలు తమ వ్యాపారాలు, లేక రెస్ట్ మోడ్ లోనే ఉండేవారంటున్నారు. కానీ చంద్రబాబు లడ్డూ వివాదాన్ని లాగుతూ, పీకుతున్నందున తమకు వచ్చే ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకు దూరమవుతుందని భావించి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్లు నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలు ఒక్కసారి ఫ్రేమ్ లో కనపడటంతో వైసీపీ క్యాడర్ లోనూ ఉత్సాహం కనిపిస్తుంది.
ముగ్గురు నేతలు...
వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని వంటి వారు తిరిగి యాక్టివ్ కావడంతో ఇక మిగిలిన లీడర్లు కూడా వరసగా పార్టీలో చురుగ్గా పాల్గొంటారంటున్నారు. ఇది క్యాడర్ లో కొంత ధైర్యాన్ని ఇచ్చే అంశంగానే చెప్పాలి. కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడమే అతని వర్గానికి షాకింగ్‌గా చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీ నుంచి అయినా ఏ గుర్తు మీద అయినా గెలిచి సత్తా చాటే కొడాలి నాని ఓటమిని క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలు కూడా చేసింది ఆయనే. లోకేష్ ను కూడా అనేక సార్లు అనకూడని మాటలు అని టీడీపీకి ప్రధాన శత్రువుగా మారారు.
వల్లభనేని వంశీ కూడా...
ఇక వల్లభనేని వంశీ కూడా అంతే. గన్నవరం నియోజకవర్గంలో 2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుదారిగా నిలిచారు. చంద్రబాబు కుటుంబాన్ని కూడా దూషించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలా ఇద్దరు నేతలు ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో సహజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారినే టార్గెట్ చేస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు వందరోజుల దాటిన తర్వాత లడ్డూ వివాదం మరింత ముదురుతుండటంతో కీలక నేతలు ఎంట్రీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అనేక మంది వైసీపీ నేతలు రోడ్డు మీదకు వస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. మరి చూడాలి.. ఏంజరుగుతుందనేది.
Next Story