Mon Mar 31 2025 09:40:26 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan Reddy : జగన్ .. ఇలా చేస్తే ఎలా? గెలిపిస్తే తప్ప నువ్వు కనపడవా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం కనిపించడం లేదు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని ఖచ్చితంగా చెబుతున్నారు. ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు అయ్యే ఛాన్స్ లేదు. గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కొత్తగా గెలిచిన వారు కూడా ఉన్నారు. వారికి కూడా తాము సభకు వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించాలని ఉంటుంది. జగన్ హుకుం కారణంగా వారు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేతగా ఆయన సభకు దూరంగా ఉండవచ్చు. అంతే తప్ప మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలను ఆపే హక్కు ఎక్కడిది అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.
హోదా ఇస్తే నే వెళతారా?
అయితే నెంబరు వల్లనే తాము ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ దానిని పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. సభకు వెళ్లాలి. అవమానాలు భరించాలి. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దాదాపు మూడున్నరేళ్ల పాటు సభకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. అవమానాలు భరించాలని, అప్పుడే మరింత సానుభూతి పెరుగుతుందని చెబుతున్నప్పటికీ జగన్ తన చెవులకు ఎక్కించుకోవడం లేదని వైసీపీ నేతలే చెబుతున్నారు. అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ శాసనమండలి విషయంలో మాత్రం అలాంటి షరతులు ఉంచలేదు. అక్కడ తమ పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీలు సభకు హాజరవుతున్నారు.
అవమానాలు ఎదురైనా...
సభకు వెళితే ఏం జరుగుతుంది? అవమానకరమైన మాటలు వినాల్సి వస్తుంది. సెటైర్లు చెవిన పడతాయి. జగన్ కు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చిన సమయంలో ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. అదే సమయంలో అధికార పార్టీపై కూడా విమర్శలు చేయవచ్చు. అంతే తప్ప తనకు అధికారం ఇస్తే తప్ప అసెంబ్లీకి రానని మొండికేస్తే ఎవరికి నష్టం అని నిలదీస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లినా సభలో వేసే ప్రశ్నలు రికార్డవుతాయి. అవి పదికాలం పాటు గుర్తిండిపోతాయి. సభకు వెళ్లినంత మాత్రాన జగన్ గౌరవానికి భంగం కలిగించేందుకు ఎవరూ ప్రయత్నించరు. ఒకవేళ ప్రయత్నించినా వారిని ప్రజలు చీత్కరించుకుంటారు. గత శాసనసభలో అలా వ్యవహరించిన వారిని ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
బడ్జెట్ సమావేశాల్లో...
అందులోనూ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. టీడీపీ కూటమి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలున్నాయి. వీటిపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులా జగన్ చేజార్చుకుంటున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. బయట ఎంత మొత్తుకున్నా, మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేసినా ఫలితం లేదు. ప్రజా సమస్యలకు రెస్పాన్స్ రావాలంటే సభకు వెళ్లాలని పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా చెబుతున్నప్పటికీ జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. బెంగళూరులో కూర్చుని శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలను చూస్తారేమో. మరి జగన్ ఇకనైనా ఆలోచనను మార్చుకుని సభకు రావాలని వైసీపీ క్యాడర్ కూడా కోరుతుంది.
Next Story