Fri Nov 22 2024 17:21:02 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఉత్తరాంధ్రలో ఊపు ఆ పార్టీకే ఉందంటగా.. అందుకే అంత ధైర్యంగా ఉన్నారా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తవడంతో నేతలు ఇంకా పోస్టుమార్టం చేసుకుంటున్నారు. వివిధ నివేదికలు తెప్పించుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయినా పార్టీ నేతలు ఇంకా పోస్టుమార్టం చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నివేదికలు తెప్పించుకుని పోలింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందన్న దానిపై ఒక స్టడీ చేస్తున్నారు. పోలింగ్ కు, ఫలితాల వెల్లడవడానికి ఇరవై రోజులు సమయం ఉండటంతో లెక్కలతో కాలక్షేపం చేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? ఈ ప్రాంతంలో ఏ అంశాలు ప్రభావితం చేశాయి? పోలింగ్ శాతం పెరగడానికి కారణాలేంటి? ఓటర్ల మూడ్ ఎలా ఉంది? ఒకవైపే ఉన్నారా? అందుకు కారణాలు ఏంటి? అన్న దానిపై ప్రధానపార్టీలైన టీడీపీ, వైసీపీలు ఇంకా కసరత్తులు చేస్తూనే ఉణ్నాయి.
అయితే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయన్న అంచనాలు మాత్రం రెండు పార్టీల నుంచి కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు. వారు తమకు మంచి చేసిన వారిని ఎన్నడూ మరచి పోరు అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. వాళ్లు ఎప్పుడూ గొంతెమ్మ కోర్కెలు కోరుకోరంటారు. తమకు ఉన్నదాంట్లో తిని బతికే వాళ్లుగా వారిని అందరూ భావిస్తారు. అందుకే ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాల నుంచి వెళ్లిన వాళ్లే పెత్తనం చేస్తున్నా వాళ్లు మాత్రం పట్టించుకోరు. రాజకీయంగా కావచ్చు. వ్యాపార పరంగా కావచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు అందరినీ అక్కున చేర్చుకుంటారన్న నానుడితో అక్కడకు అనేకమంది చేరి ఇప్పుడు ఎవరికీ అందనంత స్థాయిలో ఉన్నవాళ్లకు కొదవలేదు. ఎక్కడి నుంచి వచ్చారని కాదు.. వాళ్లు గుర్తులను చూసి ఓటు వేసే రకం అంటారు. అంత మనసున్నోళ్లు. మంచోళ్లు.
పట్టున్న ప్రాంతం కావడంతో...
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈసారి తమకు ఎక్కువ స్థానాలు వస్తాయని టీడీపీ భావిస్తుంది. ఉత్తరాంధ్ర ఎప్పుడూ టీడీపీకి కంచుకోట. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నాటి నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టున్న స్థానాలు చాలా ఉన్నాయి. అయితే పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలతో పాటు సీనియర్ నేతలు కూడా ఉండటం ఇక్కడ తమకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో రెండు సెగ్మంట్లలో మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే ఈసారి వాటి సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తుంది. విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి అక్కడ ఖచ్చితంగా కొన్ని స్థానాలను సాధిస్తామని నమ్మకంతోఉంది. ఇక విశాఖపట్నంలో గత ఎన్నికల్లో నాలుగు స్థానాలకే పరిమితమైన తాము ఈసారి అత్యధిక స్థానాల్లో విజయ దుందుభి మోగించడం ఖాయమని చెబుతుంది.
రీజన్ అదేనట...
అధికార వైసీీపీ విషయానికి వచ్చేసరికి విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తామని ప్రకటించడంతో అక్కడ రియల్ బూమ్ వచ్చిందంటున్నారు. ఆ ప్రకటన ఇటు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయని, దీంతో ఈసారి గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెబుతుంది. మరోవైపు పథకాలు కూడా పనిచేశాయని, మహిళలు అత్యధికంగా ఓటింగ్ కు రావడంతో తమకు అత్యధిక స్థానాలు వస్తాయని నమ్మకంగా ఉంది. తాము ఓడిపోతామనుకున్న నియోజకవర్గాల్లోనూ టఫ్ ఫైట్ ఇవ్వడాన్ని ఉదాహరణగా చూపుతుంది. మూడు జిల్లాల్లో ఈసారి కూడా తమదే పైచేయి అని అంటుంది. అందుకని తమకు ఏ విధమైన ఢోకా లేదని, ఉత్తరాంధ్రలో మరోసారి వేవ్ తమవైపే ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు నమ్ముతున్నారు. మరి ఎవరి అభిప్రాయాలు వారివి. జనం మాత్రం ఎవరికి ఓటు వేశారన్నది మాత్రం జూన్ 4వ తేదీ వరకూ సస్పెన్స్
Next Story