Sat Jan 11 2025 13:08:38 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఆళ్లగడ్డ పల్స్ ఎలా ఉన్నాయంటే.. ఈసారి మాత్రం కొంత తేడా కొడుతున్నట్లుందే?
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తినెలకొంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా ప్రతి నియోజకవర్గం కీలకమే. రెండు పార్టీలూ పోటా పోటీగా తలపడ్డాయి. పోలింగ్ కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. అందులో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ పోటా పోటీగా ఎన్నిక జరిగింది. మాజీ మంత్రి అఖిలప్రియ టడీపీ నుంచి పోటీ చేయగా, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇటు భూమా కుటుంబం, అటు గంగుల కుటుంబం ఆళ్లగడ్డను తమ అడ్డాగా చేసుకుని మరీ ఏలుతున్నారు. తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని వీళ్లిద్దరూ మరోసారి బరిలోకి దిగారు.
గత ఎన్నికల్లోనూ ఇద్దరూ పోటీ పడ్డారు. అయితే గత ఎన్నికల్లో మాజీ మంత్రి అఖిలప్రియ వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డిపై దాదాపు ముప్ఫయి వేల తేడాతో ఓడిపోయారు. గంగుల కుటుంబం 2004లో గెలిచిన తర్వాత 2019 ఎన్నికల్లోనే మళ్లీ గంగుల కుటుంబం ఆళ్లగడ్డలో జెండా పాతింది. 2009, 2012, 2014 ఎన్నికల్లో వరసగా భూమా కుటుంబమే విజయం సాధించింది. అయితే భూమా దంపతుల మరణం తర్వాత ఆ కుటుంబంలో కొంత చీలికలు వచ్చాయి. భూమా నాగిరెడ్డి సోదరుల కుమారులు కూడా అఖిలప్రియకు యాంటీగా మారారు. అయినా ఒంటరిగానే పోరాటం చేయడం అలవాటుగా మార్చుకున్నారు.
ఐదేళ్ల నుంచి...
తన మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నప్పటికీ భూమా అఖిలప్రియ మాత్రం టీడీపీలో చేరి రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. భూమా కుటుంబానికి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో ఆ కుటుంబానికి ఆళ్లగడ్డ టిక్కెట్ ఒక్కటే దక్కింది. నంద్యాల టిక్కెట్ కేవలం పట్టు కోల్పోవడం వల్లనే చేజారి పోయింది. భూమా సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డిని కూడా ఆ కుటుంబం దూరం చేసుకుంది. దీంతో శత్రువులు ఎక్కువ.. మిత్రుల తక్కువ అన్నట్లు తయారయింది భూమా కుటుంబ పరిస్థిితి. ఈ ఐదేళ్లలో గంగుల కుటుంబాన్ని అఖిల గట్టిపోటీనే ఎదుర్కొంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నారు. మాటకు మాట బదులిచ్చారు. కేసులు ఎదుర్కొన్నారు. అయినా ఎక్కడా తగ్గకుండా ఎదుర్కొన్నారు.
గట్టి పోటీనే...
ఆళ్లగడ్డలో ఈసారి అఖిలప్రియ, గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి మధ్య జరిగిన పోటీ టఫ్ గానే సాగిందంటున్నారు. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా వైసీపీకే ఎడ్జ్ ఉందని చెబుతున్నప్పటికీ అఖిలప్రియ మాత్రం చాలా హోప్స్ పెట్టుకున్నారు. అక్కడ బలిజ సామాజికవర్గం ఓట్లు కూడా ఎక్కువ కావడం, టీడీపీ, జనసేన పొత్తు ఉండటం తనకు ఈసారి కలసి వస్తుందని భావిస్తున్నారు. గంగుల కుటుంబం మాత్రం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అందుకే అఖిలప్రియ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. తాను ఎదుర్కొన్నది జగన్ మాత్రమేనని, గంగుల కుటుంబాన్ని కాదని ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పకతప్పదు. ఇది ఒక ఆళ్లగడ్డకే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అయినా ఆళ్లగడ్డలో ఈసారి కూడా అఖిలకు కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. కానీ ఫలితాలు వెలువడే సమయానికి ఎవరు విజేతలన్నది మాత్రం జూన్ 4వ తేదీన తెలియనుంది.
Next Story