Fri Nov 22 2024 20:40:58 GMT+0000 (Coordinated Universal Time)
Nda Alliance : కొంప ముంచేటట్లే ఉందే మామా... బ్రో...ఇప్పుడేం చేయాలి సామీ.. ఇలా జరిగిదేంటి చెప్మా?
స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. అయితే పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు జనసేన గుర్తు అయిన గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకోవడం కూటమి అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో మాత్రం గాజుగ్లాసు గుర్తును వారికే కేటాయిస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం గాజుగ్లాసు గుర్తు ను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే వీలుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గాజు గ్లాసు ఫ్రీ సింబల్ కావడంతో దానిని మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించారు.
జనసేన పార్టీ ఆవిర్భవించి పదేళ్లు దాటుతున్నా 2014 ఎన్నికల్లో అది పోటీకి దూరంగా ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసి ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది. ఓటింగ్ కూడా ఆరు శాతానికి మించలేదు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడంతో ఆ పార్టీ అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో గాజుగ్లాసు ను ఫ్రీ సింబల్ గా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనిపై జనసేన పార్టీ న్యాయపరంగా అన్ని రకాలుగా పోరాటం చేసింది. తాము పోటీ చేయని స్థానాల్లోనూ గాజు గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించవద్దంటూ ఎన్నికల కమిషన్ ను కోరింది.
25 నియోజకవర్గాల్లో...
రిటర్నింగ్ అధికారులు ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరిగింది. గాజు గ్లాసు కానీ ఫ్రీ సింబల్ గా ఉండటంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు జనసేన అభ్యర్థులకు ఇచ్చే గాజు గ్లాసు గుర్తును కేటాయించడం ఇప్పుడు గెలుపోటములపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కూటమి కూటమి అభ్యర్థులను టెన్షన్ పెడుతుంది. మచిలీపట్నం, జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులకు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించినట్లు వార్తలు అందుతున్నాయి. నెల్లూరు టౌన్ లో కూడా బీజేపీ రెబెల్ గా పోటీ చేసిన అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారని తెలిసింది.
ప్రత్యామ్నాయ మార్గాల కోసం...
కూటమి ఏర్పడిన తర్వాత కొంత ఊపులో ఉన్న పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు టెన్షన్ పెడుతుంది. స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటం కూడా వైసీీపీ వ్యూహంలో భాగమేనని, వారు మాత్రమే గాజు గ్లాసు ను రిటర్నింగ్ అధికారులను కోరుతుండటంతో వారికి కేటాయింపులు జరగడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక పార్టీ నేతలు తలలను పట్టుకుంటున్నారు. అసలే గ్రామీణ ప్రాంతాల్లో ఈవీఎంలో పేరును చూసి కాకుండా గుర్తును చూసి ఓటేసే వారు ఎక్కువ కావడంతో ఇప్పుడు వాళ్లు చీల్చే ప్రతి ఓటు మనకు నష్టం చేకూరుస్తుందన్న అంచనాలలో కూటమి నేతలున్నారు. దీనిపై ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భావిస్తున్నారు. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో అదీ ముఖ్యంగా బీజేపీ పోటీ చేసే స్థానాల్లో గుర్తుపై ఎక్కువ ప్రచారం చేయాలని అనుకుంటున్నా.. చివరకు ఏమవుతుందో అన్న టెన్షన్ మాత్రం కూటమి అభ్యర్థుల్లో ఉంది.
Next Story