Thu Dec 26 2024 02:39:05 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : రగులుతున్న గుండెలు.. సమయం కోసం వేచి చూస్తున్నారా? నిఘా వర్గాల నివేదికలో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ప్రతీకారంతో ఇరుపార్టీల నేతలు రగిలిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ప్రతీకారంతో ఇరుపార్టీల నేతలు రగిలిపోతున్నారు. కేంద్ర ఇంటిలిజెన్స్ నుంచే ఎన్నికల ఫలితాల తర్వాత హింస పెద్దయెత్తున చెలరేగే అవకాశముందన్న హెచ్చరికలు ఇందుకు అద్దంపడుతున్నాయి. అయితే ఒకరు ఎక్కువ. మరొకరు తక్కువ అని కాదు. రెండు వర్గాలు ఎవరికి వారే అదను కోసం వేచి ఉన్నారు. సమయం కోసం స్పాట్ పెట్టేందుకు రెడీ అయిపోయారన్నది నిఘా వర్గాల సమచారం. అందుకే పోలీసు యంత్రాగానికి కూడా ఫలితాల తర్వాత చాలా రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలను కంట్రోల్ లో పెట్టడం మామూలు విషయం కాదు. ఆషామాషీ కాదు. నిర్దాక్షిణ్యంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే తప్ప జరగబోయే హింసను అరికట్టలేరు. ఇది ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్న విషయమే. అందుకే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
రెండు పార్టీలూ...
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు సై అంటున్నాయి. అగ్రనేతల నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకూ కసితో ఉన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకరు మరొకరిపై ప్రతీకారం తీర్చుకోవడం గ్యారంటీ అన్న ప్రమాద ఘంటికలు పోలీసు వర్గాలను సయితం వణికిస్తున్నాయనే చెప్పాలి. అధికారం కోసం ఎక్కడైనా రాజకీయ విమర్శలే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అవతల వాడు గెలవకూడదని తామే అందలం ఎక్కాలన్న బలమైన కోరికతో పాటు ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తమకు ఎదురే ఉండదన్న భావన ఇరు పార్టీల్లోనూ కనపడుతుండటం ఆందోళనను కలిగిస్తుంది. ఇది సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. పోలీసులు కఠిన మైన చర్యలు తీసుకోకపోతే మాత్రం పరిస్థితి అదుపు తప్పే అవకాశముందని నిఘా సంస్థలే చెబుతున్నాయి.
తిరుపతిలోనూ ఎన్నడూ లేని విధంగా...
ముఖ్యంగా పల్నాడు,రాయలసీమలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పల్నాడులో ఎప్పుడూ అంతే. పగలు.. ప్రతీకారాలు అక్కడ మామూలే. కానీ తిరుపతి వంటి ప్రాంతాల్లోనూ హింస చెలరేగడం, కత్తులు, కర్రలతో దాడులకు దిగడం, ప్రత్యర్థులను మట్టుబెట్టాలన్న ప్రయత్నాలు చూస్తుంటే ఏడుకొండల వాడు నెలవైన చోట కూడా ఇలాంటి పరిస్థితి ఏంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశమైన తిరుపతిలో ఇటువంటి ఘటనలు భక్తుల రాకపోకలపై ప్రభావం చూపుతాయమోనన్న ఆందోళన కూడా ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేనిది.. ఇప్పుడు కొత్తగా మొదలయింది. అక్కడ మొదలయిందే.. ఇక ఆగడం కష్టమేనన్నది అందరి అభిప్రాయం. అందుకే తిరుపతిలో మొదలయిన ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను మొగ్గలోనే తుంచేయడానికి పోలీసులు మాత్రమే కాదు రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది.
పోలీసులు ఏకపక్షంగా...
తాడిపత్రి గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య వార్ మామూలుగా లేదు. వారి మధ్య ఎన్నో కుటుంబాలు నలిగిపోతున్నాయి. తాడిపత్రి ప్రజలకు ఇది కొత్త కాకపోయినా దానిని నివారించాల్సిన పోలీసులే ఏకపక్షంగా వ్యవహరించడం కూడా విమర్శలకు దారి తీస్తుంది. పోలీసులు ఒక పక్షాన ఉండి మరొక పక్షాన్ని తొక్కేయాలన ప్రయత్నిస్తే వాళ్లు మరింత రెచ్చి పోతారని అందరికీ తెలుసు. అందుకే పోలీసులు కూడా సంయమనంతో వ్యవహరించి, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే తాడిపత్రి లాంటి చోట్ల ఘర్షణలు జరగవన్నది వాస్తవం. ఆ దిశగా పోలీసులు ప్రయత్నం చేయాలి. లేకుంటే తాడిపత్రి, తిరుపతి వంటివి పోలీసుల నిర్లిప్తతతో తగలపడి పోతూనే ఉంటాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.
Next Story