Mon Dec 23 2024 05:16:50 GMT+0000 (Coordinated Universal Time)
KCR and Ys Jagan : కేసీఆర్ కామెంట్స్ జగన్ కు నష్టం తెస్తాయా? అదనపు ఓట్లు తెచ్చిపెడతాయా?
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు ఏమేరకు ఉపయోగపడతాయన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో నడుస్తుంది
KCR and Ys Jagan :కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు ఏమేరకు ఉపయోగపడతాయన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో నడుస్తుంది. నిన్న ఒక టీవీ లైవ్ షోలో ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని తనకు సమాచారం ఉందని చెప్పడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా పందొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ కామెంట్స్ జగన్ కు ఏ మేరకు ఉపయోగపడతాయి? నష్టం చేకూరుస్తాయా? లేక అదనంగా ఓట్లు తెచ్చి పెడతాయా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. నిజానికి కేసీఆర్ తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూనే తనకు ఉన్న సమాచారం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ను టీడీపీ కూటమి సీరియస్ గానే తీసుకుంది.
గతంలోనూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన ఆస్తుల విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తుంది. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ కు ఆర్థికంగా సాయపడ్డారని కూడా ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ కేసీఆర్ కు మంచి మిత్రుడని, ఆయన అలా మాట్లాడకుండా తాము ఎలా గెలుస్తామని చెబుతాడంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అంటే ఫస్ట్ నుంచి కేసీఆర్ కు పడదని, చంద్రబాబును అనేకసార్లు మీడియా సమావేశాల్లో కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
తాము అలెర్ట్ అవ్వడానికి...
అయితే ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కొంత అప్రమత్తమయిందంటున్నారు. తమ క్యాడర్ మరింత అలెర్ట్ అవ్వడానికి కేసీఆర్ వ్యాఖ్యలు దోహదపడ్డాయంటున్నారు. కేసీఆర్ కు బీజేపీ తో కలిసినందుకు ఇక్కడ కూటమి గెలవకూడదని కోరుకుంటున్నారని, తన మనసులోని మాటను అందిన సమాచారంగా చెప్పారే తప్ప ఆయన ఏదైనా సర్వేలు చేయించి చెప్పలేదు గదా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడూ జగన్ పక్షమేనని, ఆయన అందుకే ఆయన జగన్ గెలుస్తాడని చెప్పాడని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. చంద్రబాబును స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ లో ఆందోళనలు చేయకుండా అడ్డుకున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
వైసీపీ మాత్రం...
మరోవైపు కేసీఆర్ అంచనాలు కొంత నిజమవుతాయని వైసీపీ క్యాడర్ చెబుతోంది. ఏపీలో ఇప్పటికీ కేసీఆర్ అంటే అభిమానం ఉన్నవాళ్లు ఎక్కువ మందే ఉన్నారన్నది వైసీపీ నేతల అంచనా. ప్రధానంగా తటస్ట, సైలెంట్ ఓటర్లు కేసీఆర్ కామెంట్స్ తో తమ వైపు చూసే అవకాశముందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి నష్టం జరగలేదని, అందువల్లనే హైదరాబాద్ నగరంలో అన్ని సీట్లను బీఆర్ఎస్ మొన్న గెలుచుకుందని, అందుకే ఇక్కడ కూడా కేసీఆర్ వ్యాఖ్యలు తమకు ఎంతో కొంత ఉపయోగపడతాయే తప్ప నష్టమయితే జరగదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ ఏపీ ఎన్నికలపై చేసిన కామెంట్స్ పై ఇప్పుడు రాజకీయంగా ఎవరికి వారు మలచుకుంటూ తమదే గెలుపు అని చెప్పుకుంటున్నారు.
Next Story