Thu Dec 19 2024 15:00:42 GMT+0000 (Coordinated Universal Time)
Alliance : ఎవరికి వారే.. సమన్వయ లోపం... గుర్తుల ప్రచారంపై అధినేతల సీరియస్
కూటమి అభ్యర్థులు కేవలం ఒక గుర్తు మాత్రమే ఇంటింటి ప్రచారంలో చెబుతుండటం పార్టీ అగ్రనేతలకు తలనొప్పిగా మారింది
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కూటములు తలనొప్పిగా తయారయింది. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఉమ్మడిగా అనేక చోట్ల ప్రచారాన్ని నిర్వహించడం లేదు. పైగా శాసనసభ అభ్యర్థులు తాము పోటీ చేసే స్థానాల్లో కేవలం తమ పార్టీ గుర్తునే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నం పార్టీ అధినేతల దృష్టికి రావడంతో వారు క్లాస్ పీకినట్లు తెలిసింది. రెండు గుర్తులు చెబితే ఓటర్లు గందరగోళానికి గురవుతారని భావించి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు కేవలం తమ పార్టీ గుర్తునే ఇంటింటికీ తిరిగి చెబుతున్నట్లు తెలియడంతో వారికి ఫోన్ చేసి మరీ పార్టీ అధినేత వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురికాకూడదనే తమ పార్టీ సింబల్ ను మాత్రమే ప్రచారం చేస్తున్న వైనాన్ని అధినేత దృష్టికి తీసుకు వచ్చారు.
మూడు పార్టీలూ దాదాపుగా అంతే విధంగా ఉన్నాయని తేలడంతో మరోసారి అభ్యర్థులందరికీ పార్టీ ప్రధాన కార్యాలయాల నుంచి ఫోన్ల ద్వారా హెచ్చరించినట్లు తెలిసింది. ఇలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. అంతెందుకు విజయవాడకు పొరుగునే ఉన్న రెండు జిల్లాల్లో ఒక పార్టీ అభ్యర్థులు శాసనసభకు పోటీ చేసే తమ గుర్తును మాత్రమే జనంలోకి తీసుకెళుతుండటం ఇప్పుడు తలనొప్పిగా మారింది. అలాగే రాయలసీమలోని తిరుపతి, రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు సయితం ఇదే పని చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమ సింబల్ ఎటూ ప్రజలకు సుపరిచితమే కాబట్టి, మరో పార్టీ సింబల్ సూచిస్తే ఓటర్లు కన్ప్యూజన్ కు గురవుతారని భావించి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ విధమైన ప్రచారానికి దిగుతున్నారు.
అధినేతలు ప్రస్తావిస్తున్నా...
ఓటర్లు ఈవీఎంల వద్ద గందరగోళానికి గురి కాకుండా ఉండేలా తమ గుర్తును మాత్రమే చెబుతుండటం ఇప్పుడు ఒక పార్టీకి ఇబ్బందికరంగా మారింది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న భయం పట్టుకుంది. రేపటి ఫలితాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో ఒక పార్టీ అభ్యర్థి గెలిచి పార్లమెంటు లో పోటీ చేసిన కూటమి అభ్యర్థి ఓడిపోతే క్రాస్ ఓటింగ్ జరిగిందని ఖచ్చితంగా తెలిసిపోతుంది. అది తమకు భవిష్యత్ లో తలనొప్పిగా మారుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనేతల్లో వ్యక్తమవుతుంది. అగ్రనేతలు కలసి ప్రచారం చేస్తున్నప్పుడు మూడు గుర్తులను ప్రచారం చేస్తున్నారు. అయితే అవి బహిరంగ సభలు, రోడ్ షోలు. కానీ అభ్యర్థులు ఇంటింటికీ చేస్తున్న ప్రచారంలో మాత్రం ఒక గుర్తునే ప్రస్తావిస్తుండటాన్ని తప్పుపడుతున్నారు.
ఇంటింటి ప్రచారంలో...
ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభల కంటే ఇంటింటికీ ప్రచారమే ఎక్కువగా జనంలోకి వెళుతుంది. కరపత్రాలలో రెండు గుర్తులు ఇస్తున్నప్పటికీ ప్రచారం చేయడం మాత్రం తమ పార్టీకే ఓటు వేయాలని సూచిస్తుండటం కామన్ గా మూడు పార్టీలకు ఇబ్బందిగా మారింది. దీనిని అధిగమించేందుకు పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జులను కేంద్ర పార్టీ కార్యాలయం ప్రత్యేకంగా సూచనలు చేసినట్లు చెబుతున్నారు. ప్రతి అభ్యర్థి తమ గెలుపు ముఖ్యమని భావించడం సహజం. అయితే అదే సమయంలో రెండు గుర్తులను తాము చెబితే ఓటర్ల వద్ద సమయం ఎక్కువ కావడంతో పాటు ఓటర్లు తికమక కాకూడదనే అత్యధిక మంది తమ పార్టీ గుర్తునే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story