Mon Dec 23 2024 08:10:16 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ పిఠాపురంలో నివాసం ఉండేది ఇక్కడే.. హెలిప్యాడ్ తో సహా అన్ని ఏర్పాట్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఒక భవనాన్ని నేతలు సిద్ధం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఒక భవనాన్ని నేతలు సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ అక్కడే నివాసం ఉంటానని ఇటీవల జరిగిన నాలుగు రోజుల పాటు ప్రచారంలో ప్రకటించిన నేపథ్యలో నేతలు ఆయన నివాసం ఉండేందుకు ఒక భవనాన్ని చూశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఒక మూడంతస్థుల భవనాన్ని పవన్ నివాసం ఉండేందుకు ఎంపిక చేశారు.
అభిమాని భవనం కావడంతో...
ఇది జనసేన పార్టీ కార్యకర్త, పవన్ అభిమాని అయిన ఓదూరి నాగేశ్వరరావుకు చెందిన భవనం. దీనినే పవన్ తన ఆవాసంగా మార్చుకుంటున్నారు. పిఠాపురం వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ఇక్కడే బస చేసేందుకు, పార్టీ కార్యాలయాన్ని కూడా ఈ భవనంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పొలాల మధ్య ఈ భవనం ఉండటతో పార్కింగ్ కు కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఈ భవనాన్ని జనసేన నేతలు ఎంపిక చేశారు. చేబ్రోలు బైపాస్ రోడ్డులో ఈ భవనం ఉంది. ఉగాది పండగ ను కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్కింగ్ సౌకర్యం...
ఈ నెల 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 9వ తేదీన పిఠాపురం వచ్చి పవన్ ఉగాది వేడుకల్లో పాల్గొనేలా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ భవన యజమాని ఓదూరి నాగేశ్వరరావు పవన్ కు వీరాభిమాని కావడంతో తనకు అద్దె కూడా అవసరం లేదని చెప్పారంటున్నారు. ఎన్ని వాహనాలయినా పార్కింగ్ చేసుకునే అవకాశముండటంతో దీనినే ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ భవనంలో ఇటీవల గృహప్రవేశం కూడా జరిగిందని, త్వరలోనే పవన్ ఈ నివాసం నుంచి తన కార్యకలాపాలను ప్రారంభిస్తారని చెబుతున్నారు. భవనానికి సమీపంలోనే హెలిప్యాడ్ ను కూడా నిర్మిస్తున్నారు.
Next Story