Mon Dec 23 2024 03:43:08 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : మా బెజవాడోళ్లు అంతే బాబాయ్... మాతో పెట్టుకుంటే మడతెట్టేస్తాం మామా?
గతంలో ప్రజారాజ్యంలో కేశినేని నాని, ఇప్పుడు జనసేనలో పోతిన మహేష్ లు ఆ పార్టీకి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తూ వైదొలిగారు
చాలా రోజుల క్రితం ఒక మాట వినిపించేది. విజయవాడను రాజకీయ రాజధాని అనేవాళ్లు. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ లో విజయవాడ వాణిజ్య రాజధాని అని పేరున్నా.. రాజకీయ రాజధాని అని పిలుచుకునే వారు. తర్వాత ఆ పేరు పోయిందనుకోండి. ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే...? బెజవాడోళ్లు రాజకీయాల్లో హాట్ హాట్ గా ఉంటారు. విజయవాడ ఎండల్లాగే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అక్కడి రాజకీయ నేతల మనసులు హీటెక్కి ఉంటాయి. ఎప్పుడు ఏం మాట్లాడతారో? ఎవరిని పొగుడుతారో? ఎలా టర్న్ అవుతారో? వారికే తెలియదు. అందుకే బెజవాడోళ్లతో అన్ని పార్టీలు జాగ్రత్తగా రాజకీయాలు చేయాలనుకుంటాయి. రాజకీయ పార్టీ నేతలకు అనేకసార్లు హెచ్చరికలు వచ్చినా ఎప్పటికప్పుడు అంతే మరి.
నాడు ప్రజారాజ్యంలో...
ఇప్పుడు చెప్పొచ్చేద్దేమిటంటే... గతంలో చిరంజీవికి జరిగినట్లుగానే.. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ కు అదే జరిగింది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. రాష్ట్రమంతటా ఆయన ప్రభంజనం సృష్టిస్తారని అనుకున్నారు. అయితే రాంగ్ టైమ్ కావడంతో పద్దెనిమిది సీట్లకే పరిమితమయి చివరకు కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని కలిపేశారు. అయితే అంతకు ముందు మాత్రం ఒక సీన్ జరిగింది. అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది. నాడు ప్రజారాజ్యంలో ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నాని చేరారు. విజయవాడ సీటును ఆశించారు. కానీ ఆయనకు సీటు దక్కలేదు. దీంతో కేశినేని నాని బరస్ట్ అయ్యారు. చిరంజీవి సీట్లు అమ్ముకున్నారంటూ నేరుగానే విమర్శలు చేశారు. కొందరి వద్ద ఇళ్ల స్థలాలను రాయించుకుని మరీ సీట్లు కేటాయించారంంటూ నాడు కేశినేని నాని బహిరంగంగానే విమర్శలు చేసి ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు.
నేడు జనసేనలో...
ఇప్పుడు జనసేనలోనూ అంతే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ తమ్ముడు పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నాడు. పశ్చిమ నియోజకవర్గం సీటును పోతిన మహేష్ ఆశించాడు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన జనసేనకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన బలమైన సామాజికవర్గం నేత కూడా. కూటమి ఏర్పడినా తనకు సీటు ఖాయమంటూ పోతిన మహేష్ గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. అయితే చివరకు అది బీజేపీకి కేటాయించడంతో ఆయన అడ్డం తిరిగారు. తనను నమ్మించి మోసం చేశారంటూ ఆయన మండిపడుతున్నారు. సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో తన వద్ద ఆధారాలున్నాయని ఆయన ప్రకటించారు. త్వరలోనే వాటిని బయటపెడతానంటూ పోతిన మహేష్ జనసేన నేత పవన్ కల్యాణ్ కు హెచ్చరికలు జారీ చేయడం వరకూ వెళ్లింది.
సోషల్ మీడియాలో సెటైర్లు...
ివిజయవాడ ఎంపీ సీటు మూడోసారి ఇవ్వకపోవడంతో చంద్రబాబు,లోకేష్ లపై కూడా కేశినేని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు పోతిన మహేష్ వ్యవహారంతో నాడు కేశినేని నాని ఘటనను కొందరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. బెజవాడోళ్లతో పెట్టుకుంటే అంతే బాబాయ్ అంటూ సెటైర్లు విసురుతున్నారు. నాడు చిరంజీవిపై ఎలాంటి విమర్శలు బెజవాడ రోడ్డుపై నుంచి వినిపించాయో.. నేడు అవే విమర్శలు పవన్ కల్యాణ్ పైన కూడా అదే రహదారిపై మారుమోగుతున్నాయి. కానీ పార్టీల పేర్లు వేరు.. నేతలు వేరు.. మిగిలినదంతా సేమ్ టు సేమ్. అద్గదీ సంగతి అంటూ అందుకే బెజవాడ రాజకీయ నేతలతో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కామెంట్స్ బాగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నాడు ప్రజారాజ్యంలో అన్న చిరంజీవి పై కేశినేని నాని, నేడు జనసేనలో తమ్ముడు పవన్ కల్యాణ్ పై పోతిన మహేష్ విమర్శలు మరోసారి నాటి రోజులను గుర్తుకు తెచ్చాయి.
Next Story