Mon Dec 23 2024 07:29:12 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan Manifesto : ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయారా? ఇలాగయితే కష్టమేనా మరి.. వైసీపీలో హాట్ టాపిక్
గెలవాల్సిన సమయంలో విడుదల చేసిన మ్యానిఫేస్టోలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో కొంత వైసీపీ శ్రేణులు ఉసూరుమంటున్నాయి.
వైసీపీ అధినేత జగన్ మరోసారి తప్పు చేశారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. గెలవాల్సిన సమయంలో విడుదల చేసిన మ్యానిఫేస్టోలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో కొంత వైసీపీ శ్రేణులు ఉసూరుమంటున్నాయి. ప్రధానంగా రైతు రుణమాఫీ అంశాన్ని జగన్ ప్రస్తావించలేదు. కొత్త పథకాలను కూడా ప్రవేశ పెట్టలేదు. అవతల కూటమితో మూడు పార్టీలూ దూసుకు వస్తున్న తరుణంలో జగన్ ప్రస్తుతమున్న పథకాలనే కొనసాగిస్తూ వాటికి మాత్రమే నగదు పెంచుతూ పోవడంపై పెదవి విరుపులు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.
మరోవైపు పింఛను మొత్తాన్ని కూడా చంద్రబాబు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెబితే జగన్ దానిని 3,500 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడాన్ని కూడా వైసీపీ నేతలు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. చంద్రబాబు నాలుగు వేలు ఇస్తానంటే.. జగన్ 3,500 రూపాయలు అదీ.. 2024లో 250 రూపాయలు పెంచి మళ్లీ 2029 లో మరో 250 రూపాయలు పెంచుతామంటే ఎవరు ఓట్లేస్తారంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రస్తావన కూడా లేకపోవడం కూడా వైసీపీ నేతలకు ఇబ్బంది కరంగా మారింది.
రైతు రుణమాఫీ...
జగన్ అతి విశ్వాసంతో వెళ్లడం ఈ ఎన్నికల్లో ఇబ్బందికరమేనన్న వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. అసలు రైతు రుణమాఫీ ప్రస్తావన లేకుండా జగన్ పెద్ద తప్పు చేశారని కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న లబ్దిదారులు కూడా ఎవరు ఎక్కువ నగదు ఇస్తామంటే వారికే ఓటు వేస్తారని, తాము చేయగలిగేంత చేస్తామని చెప్పినా జగన్ ను జనం ఎంత వరకూ నమ్ముతారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏదో ఉంటుందనుకున్న జగన్ మ్యానిఫేస్టో వైసీపీ నేతలే ఉస్సూరుమనిపించేలా ఉందంటూ వారు తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.
అయోమయంలో నేతలు...
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టోను విడుదల చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మ్యానిఫేస్టోను విడుదల చేశారు. కేవలం రెండు పేజీలతో మ్యానిఫేస్టో విడుదల చేశారు. ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే వాటికి కొంత నగదును జోడిస్తూ మ్యానిఫేస్టోలో చోటు కల్పించారు. తన విశ్వసనీయత మేరకు జనం తనను మరోసారి ఆదరిస్తారని ఆయన నమ్ముతున్నారు. కానీ అది ఎంత వరకూ సాధ్యమన్న అయోమయంలో వైసీపీ నేతలు ఉన్నారు. చంద్రబాబు మ్యానిఫేస్టోలో సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే జనంలోకి వెళుతున్న నేపథ్యంలో జగన్ పెద్దగా హామీలు ఇవ్వకుండా తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. మూడు రాజధానులుగా కట్టుబడి ఉన్నామని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తేలా చేశారంటున్నారు.
Next Story