Mon Dec 23 2024 07:42:10 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : పవన్ కు మద్దతుగా మెగా కాంపౌండ్ కదలి రానుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించారు.. ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించారు.. ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. సరే.. సోదరుడు గెలవాలని.. అధికారంలోకి రావాలని ఏ అన్న కోరుకోడు? చిరంజీవి కూడా ఇందుకు అతీతుడు కాదు. అయితే చిరంజీవి ఇప్పటికే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పేశారు. అంటే సోదరుడు పవన్ కల్యాణ్ కు ఆయన నేరుగా ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. ఆయన ఐదు కోట్ల రూపాయలు విరాళమిచ్చిందానికి కూడా మెగా అభిమానులకు ఎక్స్ ద్వారా ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకున్నారు.
"అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను" అని ఆయన ముక్తసరిగా చెప్పేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేనకు అండగా నిలుస్తున్నట్లు ఆయన చెప్పలేదు. సమాజం కోసం ఖర్చు చేస్తున్న తన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఆర్థికంగా సాయం అందించానని మాత్రమే వివరణ ఇచ్చుకున్నారంటే రాజకీయంగా తన స్టేటస్ ఏంటో ఎక్స్ లో చెప్పేసినట్లయింది. చిరు ప్రచారానికి రారు. అది ఫిక్స్.
గత ఎన్నికల్లోనూ...
అయితే ఈసారి మెగా కాంపౌండ్ నుంచి ఎవరు ప్రచారంలో పాల్గొంటారన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మెగా కుటుంబంలో దాదాపు ఆరేడు మంది హీరోలున్నారు. వారిలో మెగాస్టార్ ను పక్కన పెడితే.. నాగబాబు ఇప్పటికే జనసేన నేతల్లో ఒకరిగా ఉన్నారు. మిగిలిన యువ హీరోలు ఈసారి ప్రచారానికి వస్తారా? గత ఎన్నికల్లో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు వచ్చి భీమవరం, గాజువాకల్లో ప్రచారం చేసి వెళ్లారు. అయితే ఈసారి వారితో పాటు అల్లు అర్జున్ కూడా వస్తారా? లేదా? అన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది. అల్లు కుటుంబం కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సినీహీరోలే. మెగా ఫ్యాన్స్ వారికి అభిమానులుగా మారారు.
అల్లు అర్జున్.. చరణ్ లు...
అల్లు అర్జున్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో మంచి హిట్ లు అందుకున్నారు. అయితే ఆయన తన పిల్లనిచ్చిన మామ రాజకీయాల్లో ఉంటేనే పట్టించుకోలేదు. అలాంటిది మేనమామ పవన్ కోసం ప్రచారానికి వస్తారా? అన్న సందేహం ఆయన అభిమానుల్లో ఉంది. అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే వేరే లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన కూడా ప్రచారానికి దూరంగానే ఉంటారా? లేదా? పిఠాపురం వరకు వచ్చి వెళతారా? అన్నది ఇంకా తేలలేదు. ఎందుకంటే చరణ్ కు తన బాబాయి పవన్ అంటే ప్రత్యేక అభిమానమని చెబుతారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన కుటుంబ సభ్యుల నుంచి ప్రచారానికి రావాలని మాత్రం కోరుకోవడం లేదట. తాము వస్తామన్నా జనసేనాని వద్దని చెబుతున్నారన్నది పరిశ్రమల వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.
Next Story