Mon Dec 23 2024 09:15:48 GMT+0000 (Coordinated Universal Time)
Nimmagadda : నిమ్మగడ్డ వల్ల ఎవరికి నష్టం... రాజకీయంగానే సుమా... ఈ మాత్రం తెలియదా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు
నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల సమయంలో ఆయన తాను ఏంటో ప్రత్యర్థులకు చెప్పే పనిలో ఉన్నట్లే కనపడుతుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలోనూ కొంతకాలం కొనసాగారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలోనూ, ప్రస్తుతం వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తూనే ఉన్నారు. 2016లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అయితే జగన్ ప్రభుత్వం స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలతో ఆయనను పదవి నుంచి తొలగించింది.
ఆయనపై నేరుగా ఆరోపణలు...
ఆయన స్థానంలో తమిళనాడు నుంచి కనకరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. అయితే అది న్యాయస్థానంలో నిలువలేదు. అప్పటి నుంచే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. హైదరాబాద్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పటి టీడీపీ, బీజేపీ నేతలను కలిసిన వీడియోలు కూడా బయటకు వచ్చి కొంత ఇబ్బంది పెట్టినా నిమ్మగడ్డ నిలదొక్కుకున్నారు. జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక మీడియా సమావేశం పెట్టారు. అదీ నిమ్మగడ్డ విషయంలోనే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు, ఆయనది ఒకే సామాజికవర్గం అని నిందించారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమార్తె శరణ్యకు చంద్రబాబు ఆర్థిక అభివృద్ధి మండలిలో స్థానం కల్పించారని కూడా ఆరోపించారు.
ఆయన ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి తప్పుకునేంత వరకూ ఇటు ప్రభుత్వానికి, అటు నిమ్మగడ్డకు మధ్య వార్ మామూలుగా జరగలేదు. తర్వాత ఆయన తన దారిని తాను హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే తాజాగా ఎలక్షన్ వాచ్ పేరుతో ఆయన ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మేధావులు, తటస్తులను ఏకం చేసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగినట్లే కనపడుతుంది. ఎందుకంటే ఆయన ప్రతి సమావేశంలో జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఎలక్షన్ వాచ్ పేరుతో ఓటర్ల నమోదు నుంచి అన్ని పోలింగ్ ప్రక్రియ వరకూ దగ్గరుండి చూసుకునేలా, న్యాయపరంగా, ఇటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ ప్రయత్నిస్తుండటం జగన్ పార్టీకి మింగుడు పడటం లేదు. గతంలో వాలంటీర్ల దొంగ ఓటర్లను నమోదు చేయించారని కూడా ఎన్నికల కమిషన్ కు ఈయన ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఫిర్యాదు చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వాలంటరీ వ్యవస్థపై...
ఆయన ఆధ్వర్యంలో ఉన్న సిటిజన్ ఫర్ డెమొక్రసీ తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీ నుంచి తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఇప్పుడు వైసీపీ నేతలు మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ తో పాటు మాజీ ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి వారు కూడా అందులో ఉన్నారు. కేవలం ఎన్నికల్లో ప్రభావితం చేసే వారిని దూరం పెట్టడమనేది ఎన్నికల కమిషన్ తీసుకునే ప్రతి నిర్ణయం అన్నీ ఆలోచించే తీసుకుంటుందని, ఎప్పటి లాగానే ఒక సామాజికవర్గంపైనా, నిమ్మగడ్డపైన నిందలు వేయడం ఎంత వరకూ సమంజమని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయలలో మరోసారి ఎన్నికల వేళ నిమ్మగడ్డ పేరు మారుమోగిపోతుంది.
Next Story