Mon Dec 23 2024 02:53:51 GMT+0000 (Coordinated Universal Time)
Manifesto : ఇద్దరి మ్యానిఫేస్టోలు విడదలయ్యాయి... అయితే ఎవరి మ్యానిఫేస్టో ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే రెండు ప్రధాన పార్టీల మ్యానిఫేస్టోలు విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే రెండు ప్రధాన పార్టీల మ్యానిఫేస్టోలు విడుదలయ్యాయి. గత నెల 27వ తేదీన వైసీపీ మ్యానిఫేస్టోను విడుదల చేయగా, 30వ తేదీన టీడీపీ, జనసేన కూటమి మ్యానిఫేస్టో విడుదలయింది. ఈ రెండు మ్యానిఫేస్టలను పరిగణనలోకి తీసుకుంటే ఎవరి మ్యానిఫేస్టోను ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తారు? ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. నిజానికి మ్యానిఫేస్టోకు ఒక బలం తెచ్చిన ఘనత మాత్రం జగన్ దేనని చెప్పాలి. గతంలో మ్యానిఫేస్టోలను ప్రజలు పట్టించుకునే వారు కాదు. అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా పెద్దగా దానిపై దృష్టి పెట్టేవారు కాదు. అప్పటికప్పడు నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తూ.. తమ పేరిట కొత్త పథకాలను తెచ్చి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకునే వారు.
కానీ 2019 ఎన్నికల తర్వాత మ్యానిఫేస్టో అనేది కీలకంగా మారిందనే చెప్పాలి. అందుకే మ్యానిఫేస్టోకు ఏపీ ఎన్నికల్లో అంత బలం చేకూరింది. ఇటు కర్ణాటక, అటు తెలంగాణ ఎన్నికల్లో గ్యారంటీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే పార్టీ ఇచ్చే మ్యానిఫేస్టోను జనం నమ్ముతున్నారనే చెప్పాలి. అందుకే పార్టీలు కూడా మ్యానిఫేస్టోను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇటు జగన్ కూడా తాను చేయగలిగినది ఇంతే అని ఖచ్చితంగా చెప్పేశారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీలు అలివి కానివి ఏమీ కావని, అందుకు సంపద సృష్టిస్తారని చెబుతున్నారు. అయితే సంపద అనేది సృష్టించడానికి ఎంత సమయం పడుతుందన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. జగన్ మ్యానిఫేస్టోలో క్వశ్చన్ మార్కు లేదు. కానీ చంద్రబాబు మ్యానిఫేస్టోలో ఖచ్చితంగా క్వొశ్చన్ మార్కు కనపడుతుంది. ఇదే రేపటి ఎన్నికల ఫలితాలను తేల్చనుంది.
రైతులు : రైతుల విషయంలో రెండు మ్యానిఫేస్టోలలో పెద్దగా తేడా లేదు. జగన్ రైతుకు పెట్టుబడ సాయం కొంత పెంచి అంటే గతంలో ఇచ్చిన దానికంటే కొంత పెంచి పదిహేడు వేలకు పెంచారు. అదే చంద్రబాబు మాత్రం తాను ఏటా ఇరవై వేలు ఇస్తానని తెలిపారు. కానీ రెండు మ్యానిఫేస్టోలో మాత్రం రైతు రుణమాఫీ లేదు. మాఫీ ప్రకటన చేస్తే రైతులు నమ్మరని కాదు. రాష్ట్ర బడ్జెట్ తో అది సాధ్యం కాదని తెలుసు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆర్ధికంగా కొంత ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఏపీ పార్టీ చీఫ్ లు గుర్తించినట్లే ఉంది.
మహిళలు : ఆంధ్రప్రదేశ్ లో మహిళలను ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు బాగానే ప్రయత్నించాయని చెప్పాలి. అమ్మఒడి, తల్లికి వందనం.. వంటి స్కీమ్ లతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఏడాదికి ఇవ్వడం, మహిళలు ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇవ్వడం వంటివి మహిళలను ఆకట్టుకునేందుకే. పోలింగ్ లో ఖచ్చితంగా ఓటు వేసేది మహిళలే కాబట్టి, వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటున్న తరుణంలో మహిళ ఓటర్ల పాత్ర ఫలితాల్లో కీలకంగా మారబోతుంది. అయితే జగన్ ఇప్పటికే మహిళలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. వారి ఖాతాల్లోనే నగదు జమ చేయడంతో కొంత జగన్ పై నమ్మకాన్ని ఏర్పరుచుకున్నారు. చంద్రబాబు ఈవిషయంలో కొంత వెనకంజలోనే ఉన్నారని చెప్పాలి.
యువత : యువత మాత్రం జగన్ పట్ల పెద్దగా ఆకర్షితులు కారనే చెప్పాలి. జగన్ ఈ ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల పట్ల చూపిన శ్రద్ధ ఉపాధి కల్పన పై దృష్టి సారించలేదనే చెప్పాలి. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి 2.50 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెబుతున్నప్పటికీ యువత మాత్రం చంద్రబాబు వైపు ఉన్నారనే చెప్పాలి. చంద్రబాబును ఒక విజన్ ఉన్న నేతగా నమ్ముతున్నారు. ఆయన హయాంలో కియా వంటి పరిశ్రమ వచ్చింది. అదే జగన్ హయాంలో చెప్పుుకునే స్థాయిలో పరిశ్రమలు రాకపోవడం కూడా ఒకింత జగన్ విషయంలో యువత మొగ్గు చూపకపోవడానికి కారణంగా చెప్పాలి.
గ్రామీణ ప్రాంతాలు : గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలంగా కనిపిస్తుంది. గ్రామాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ కార్యాలయాలకు, కనీసం మండల కేంద్రాలకు కూడా వెళ్లకుండా అన్నీ ఇంటివద్దకే వచ్చే ఏర్పాటు చేయడంతో జగన్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఒకింత జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పనులను వదులుకుని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు సర్టిఫికెట్లు, సంక్షేమ పథకాల కోసం తిరిగే తిప్పట తప్పిందన్న ధోరణిలో ఉన్నారు. అది జగన్ కు ఈ ఎన్నికల్లో ప్లస్ గా మారనుంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం చంద్రబాబు పార్టీ బలంగా కనిపిస్తుంది. అయితే చంద్రబాబు మ్యానిఫేస్టో విడుదల చేసిన తర్వాత మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజల ఆలోచనల్లో కూడా కొంత మార్పు వచ్చినట్లు వార్తలు అందుతున్నాయి.
ప్రభుత్వోద్యోగులు : ప్రభుత్వోద్యోగులు మొన్నటి వరకూ జగన్ కు వ్యతిరేకంగానే కనిపించారు. వారి వాయిస్ కూడా అలాగే ఉంది. జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో పాటు కనీసం వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కూడా సక్రమంగా అందకపోవడంతో కొంత జగన్ కు వ్యతిరేకంగానే కనిపించారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు మ్యానిఫేస్టో విడుదల చేశారో వారి ఆలోచనల్లో కొంత మార్పు వచ్చినట్లు కనపడుతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయితే తమకు జీతాలు రావడం కూడా కష్టమన్న ధోరణిలో వారు ఉన్నారని అనేక ప్రాంతాల నుంచి వార్తలు అందుతున్నాయి. అందుకే ప్రభుత్వోద్యోగులు ఏకపక్షంగా మొన్నటి తరహా మాదిరిగా చంద్రబాబు వైపు లేరన్నది మాత్రం వాస్తవం. మరి ఈ పదిరోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయన్నది చూడాల్సి ఉంది.
Next Story