Mon Dec 23 2024 05:46:28 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఇదేంది సామీ.. బెట్టింగ్ ఇన్ని ఇకోట్లా.. పోతే ముసుగేసుకోవాల్సిందేగా..?
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. గెలుపు తమదేనని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. గెలుపు తమదేనని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. కానీ ఓటర్ల నాడి మాత్రం ఈసారి ఎవరికీ అందకుండా ఉంది. పోలింగ్ అయితే పూర్తయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పర్సంటేజీ నమోదయింది. ఎంతగా అంటే.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి రెండు గంటల దాటిన తర్వాత కూడా ఓటర్లు ఉన్నారంటే ఏ స్థాయిలో పోలింగ్ జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఈవీఎం మెషిన్లను కొన్ని చోట్ల ఈరోజు ఉదయం స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాల్సిన పరిస్థిితి నెలకొంది. అంటే ఓటరు కసితో వచ్చి తాను వేయాలనుకున్న పార్టీకి ఓటు వేసి వెళ్లిపోయాడు.
అధికారంలోకి రావడంపై...
ఓటరు తన పని ముగించాడు. ఇక అధికారంలోకి వచ్చేది ఎవరన్నది మాత్రం తేలడానికి మరో ఇరవై రోజులు సమయం పడుతుంది. ఈలోగా రాష్ట్రమంతటా బెట్టింగ్ ల జోరు అందుకుంది. ఎంతగా అంటే అధికారంలోకి వచ్చే పార్టీపైన అధికశాతం బెట్టింగ్ లు జరుగుతున్నాయి. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కొందరు బెట్టింగ్ కడుతుండగా, కూటమి పవర్ లోకి రావడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు కూడా బెట్టింగ్ లకు ఎంతైనా ఓకే అని చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో ఈ బెట్టింగ్ ల స్థాయి ఎంత వరకూ వెళ్లిందంటే పొలాలను కూడా బెట్టింగ్ లలో పెడుతున్నారు. వైసీపీ గెలిస్తే ఒక ఎకరం ఇచ్చేటట్లు.. టీడీపీ విజయం సాధిస్తే దానికి రెండు రెట్లు అంటే రెండు ఎకరాలు ఇస్తామంటూ బెట్టింగ్ లకు దిగుతున్నారు. నేరుగా కొందరు ప్రాంసరీ నోట్లను రాసుకుంటున్నారు. కోట్ల రూపాయలు కూడా పందెం కాస్తున్నారు. బంగారాన్ని కూడా పణంగా పెడుతున్నారు.
పిఠాపురంపై ఎక్కువగా...
ఇక పార్టీ అధికారంలోకి రావడాన్ని పక్కన పెడితే ముఖ్యమైన స్థానాలపై కూడా బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. ప్రధానంగా రాయలసీమ, కోస్తాంధ్రలలో ఈ బెట్టింగ్‌ల జోరు ఎక్కువగా ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం పై కూడా జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. పవన్ గెలుస్తాడని, వంగా గీత విజయం ఖాయమని రెండు వర్గాలు బెట్టింగ్ లకు దిగుతున్నాయి. జనసేన నుంచి పవన్ గెలుస్తాడంటూ వేయి రెండు వేలు అంటూ బెట్టింగ్ లు కడుతున్నారు. ఇది లక్షల్లోకి వెళ్లినట్లు తెలిసింది. అంటే పవన్ గెలిస్తే లక్ష ఇవాలి. అదే వంగా గీత గెలిస్తే రెండు లక్షల రూపాయలు జనసేన పై బెట్టింగ్ కట్టిన వారు ఇవ్వాల్సి ఉంటుంది. అంతటితో ఆగకుండా పవన్ కల్యాణ్ కు వచ్చే మెజారిటీపై కూడా జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి. ఒక వ్యాపారి 2.5కోట్లు బెట్టింగ్ పవన్ గెలుస్తాడని పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ నియోజకవర్గాలపైనే...
ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేనిన మంగళగిరిపైన కూడా పెద్దయెత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయి. లోకేష్ కు ఇరవై వేల కు పైగా మెజారిటీ వస్తుందని టీడీపీ సానుభూతి పరులు పందేలు కాస్తున్నారు. అయితే మురుగుడు లావణ్యదే విజయమంటూ వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో బెట్టింగ్ లకు దిగుతున్నారు. ఇక చంద్రబాబు పోటీ చేసే కడప, ఆర్కే రోజా పోటీ చేసిన నగరి, కొడాలి నాని పోటీ చేసిన గుడివాడ, వల్లభనేని వంశీ బరిలో ఉన్న గన్నవరం, సుజనా చౌదరి పోటీ చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బెట్టింగ్ లు అంచనాలకు అందకుండా జరుగుతున్నాయి. అయితే వీళ్లంతా ఓటర్ల నాడి తమకు తెలుసునని అందుకే ఆత్మస్థయిర్యంతో తాము బెట్టింగ్ లు కడుతున్నామని చెబుతున్నప్పటికీ ఓటరు ఎవరికి ఓటు వేశారన్నది మాత్రం జూన్ 4వ తేదీన కాని తెలియదు. అయితే బెట్టింగ్ లలో కోట్లాది రూపాయల సొమ్ముచేతులు మారనున్నాయననది వాస్తవం. ఆస్తులు కూడా ఈ బెట్టింగ్ లలో పెడుతుండటం విషాదకరం.
Next Story